- అధికార పార్టీకి సవాల్ విసిరేలా నేతల దూకుడు
- ఎదురుదాడి ప్రచారం లో ముందున్న బిఆర్‌ఎస్
- కెసిఆర్‌పై నియంత పాలన అంటూ విమర్శలు
వరంగల్ వాయిస్,హైదరాబాద్: తెలంగాణలో సాధారణ ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉంది. కానీ రాజకీయ పార్టీలు అన్నీ అప్పుడే ప్రచారంలోకి దిగాయా అన్న సందేహం వస్తోంది. అధికార బిఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ బిజెపిలు కత్తులు నూరుతున్నాయి. అయితే వీరికన్నా ముందే బిఆర్‌ఎస్ బిజెపిని ఎండగడుతూ సిలిండర్‌ను చూపుతూ ప్రచారం చేస్తోంది. ప్రధానంగా గ్యాస్, పెట్రో ధరలనే హైలెట్ చేస్తోంది. కులాల వారీగా, వర్గాలవారీగా, వృత్తుల వారీగా, సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించి ఆకట్టుకుంటున్నారు. పతకాల్లో ప్రభుత్వం జోరు పెంచింది. ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజలంతా బిఆర్‌ఎస్ వెంటే ఉన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. మంత్రులు,ఎమ్‌ఎల్యేలు, ఇతర నేతలు అంతా నియోజకవర్గాల్లోనే మకాం వేసి పార్టీ వ్యూహాలను అమలు చేయడంలో క్రియా శీలకంగా సాగుతున్నారు. బిఆర్‌ఎస్ మళ్లీ గెలిపిస్తేనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరింత మెరుగ్గా కొనసాగే అవకాశాలుంటాయని ప్రజల్లో అభిప్రాయం కలిగిస్తున్నారు. ప్రచారపర్వంలో ఎదుటి పార్టీలపై వ్యక్తిగతంగా, రాజకీయంగా విమర్శల దాడిని పెంచి ముందుకు సాగుతున్నారు. కెటిఆర్,హరీష్ రావులు మరో అడుగు ముందుకు వేసి లేఖలు రాస్తూ కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచిన బీజేపీకి ఓటేద్దామా, రైతుల నడ్డివిరిచే చట్టాలు తీసుకువచ్చిన బీజేపీని గెలిపిద్దామా అంటూ బీజేపీపై రాజకీయ దాడిని ప్రారంభించారు. తద్వారా పరోక్షంగా ఆ పార్టీ ప్రాభవాన్ని తగ్గించడానికి కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. అలాగే అన్ని పార్టీల నుంచి అగ్రనేతలు నియోజకవర్గానికి వస్తున్నారు. నియోజకవర్గ ప్రజలను ప్రభావితం చేసేందుకు బిఆర్‌ఎస్ ప్రణాళిక సిద్దం చేస్తోంది. రాబోయే ఎన్నికలో గెలుపు బిఆర్‌ఎస్‌కు అత్యంత ముఖ్యం. బిజేపీ, బిఆర్‌ఎస్ అదే లక్ష్యంతో గెలుపు కోసం ప్రచారంలో పరుగులు పెడుతున్నాయి. కేసీఆర్ వ్యూహరచనను క్షేత్ర స్థాయిలో అమలు చేస్తూ మంత్రులు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. బీజేపీకి పార్టీపరంగా ఇక్కడ పెద్దగా పట్టు లేకున్నా సవాళ్లతో ఎన్నికల్లో విజయం సాధిస్తామని ప్రకటిస్తున్నారు. గతంలో వెల్లిపోయిన టీఆర్‌ఎస్ నేతలను తిరిగి పార్టీలోకి వచ్చేలా చేయడంలో ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, తదితర పార్టీల్లోని పలువురు నాయకులను, ముఖ్య కార్యకర్తలను కూడా ఆకర్షించి బిఆర్‌ఎస్‌లో చేరేలా పార్టీకి మరింత జవసత్వాలను కల్పిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో నువ్వానేనా అన్నట్లుగా ఎన్నికల ప్రకటనకు ముందే కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు పోటీపడి ప్రచారం కొనసాగిస్తున్నారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, విజయశాంతి, ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, రాజాసింగ్, ఎంపీ ధర్మపురి అరవింద్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, హిమాచల్ ప్రదేశ్ ఇన్‌చార్జి మురళీధర్‌రావు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తదితర పెద్దలు వివిధ కార్యక్రమాలతో ప్రజల్లో నిత్యం నానుతున్నారు. ఇకపోతే అధికార బిఆర్‌ఎస్‌ఎస్ శ్రేణులు ఇప్పటికే అన్ని గ్రామాల్లో మకాం వేసి ప్రజలను వ్యక్తిగతంగా కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా పాదయాత్రతో పర్యటించి ప్రచారాన్ని విస్తృతం చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి,ఎమ్మెల్యే సీతక్క, ఇతర ముఖ్య నాయకులు కూడా రోజుకో కార్యక్రమంతో అప్పుడే ప్రచారంలో దూసుకుపోతున్నారు.