నేల కూలిన భారీ వృక్షం
రోడ్డు వెడల్పులో స్వామి భక్తి వరంగల్
వాయిస్, కాశీబుగ్గ : నగరంలోని 20వ డివిజన్‌లో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో సోమవారం కురిసిన వర్షానికి భారీ వేప చెట్టు నేల కూలింది. చెట్టు రోడ్డుకు ఎదురుగా ఉన్న ఇంటిపై, విద్యుత్ తీగలపై పడింది. దీంతో విద్యుత్ స్తంభం విరిగిపోయి తీగలు వేలాడుతూ కనిపించాయి. స్థానికులు గుర్తించి విద్యుత్ కార్యాలయానికి సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో చుట్టు పక్కల ప్రాంతాలవారు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. అయితే స్వామి భక్తిని చాటుకునేందుకు మాజీ కార్పొరేటర్ ఒకరు రోడ్డు వెడల్పును అడ్డుకున్నందునే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నగర అభివృద్ధిలో భాగంగా పది రోజుల క్రితం 20వ డివిజన్‌లో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డుకు అడ్డుగా ఉన్నాయన్న నెపంతో నిరుపేదలకు చెందిన కొందరి ఇళ్లను కూడా కూల్చి వేసి రోడ్డు పనులు నిర్వహించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా తర్వాత ట్విస్టు మొదలైంది. మాజీ కార్పొరేటర్‌తో సన్నిహితంగా ఉండే ఇద్దరి ముగ్గురి ఇంటి ముందున్న ర్యాంపులు కూడా రోడ్డు వెడల్పులో తొలగించాల్సి ఉన్నా సదరు నేత హుకుం జారీ చేయడంతో పెండింగ్‌లో పెట్టారు. సదరు మాజీ కార్పొరేటర్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడున్న కొంతమందితో అతడికి ఫైనాన్స్ లావాదేవీలు ఉన్నందునే ర్యాంపులు కూల్చకుండా స్వామి భక్తిని చాటుకున్నారన్న ఆరోపనలు ఉన్నాయి. దీంతో రోడ్డు అభివృద్ది పనులుకూడా మద్యంతరంగానే నిలిచిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు అభివృద్ది పనుల్లో భాగంగా గతంలో చెట్టు పక్కనే తీసిన గోతిలో భారీగా వర్షపు నీరు చేరడంతో చెట్టు బలం తగ్గి రోడ్డుపై కుప్ప కూలిందని స్థానికులు తెలిపారు. చెట్టు రోడ్డుపై కాకుండా చుట్టు పక్కల ఉండే ఇళ్లపై పడి ఉంటే పెను ప్రమాదామే జరిగేదంటున్నారు. భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించేదంటున్నారు. ఇప్పటికైనా బల్దియా అధికారులు స్పందించి స్వామి భక్తిని చాటుకున్న సదరు మాజీ కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవడంతోపాటు నిలిపివేసిన పనులను వెంటనే పునరుద్దరించి రోడ్డు వెడల్పు చేయాలని స్థానికులు కోరుతున్నారు.


