ఆవేదనతో అనారోగ్యం బారిన పడి వ్యక్తి మృతి
వరంగల్ వాయిస్, ఆరెపల్లి: తన భూమి ధరణి సైట్ లో మరొకరిపై పేరు రావడంతో ఆవేదనతో అనారోగ్యం బారిన పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. వరంగల్ జిల్లాలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన పొగాకు మహేందర్ గౌడ్ గ్రామ గౌడ కుల పెద్దమనిషి. తనకు వారసత్వంగా వచ్చిన సర్వే నెం 565 లో 0.17 గుంటల భూమి ధరణిలో అదే గ్రామానికి చెందిన ఇతరుల పేరుపై రావడంతో గత సంవత్సరం నుంచి తహసీల్దార్ , కలెక్టర్, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి తన అనారోగ్యం క్షీణించి చివరగా శుక్రవారం మృతి చెందాడు. మహేందర్ తనకు స్వార్జితమైన భూమి తనకు దక్కాలని, ఇద్దరు కూతుర్లకు అందాలని నిత్యం మధన పడుతూ అనారోగ్యానికి గురై చనిపోవడం బాధాకరం అని , ధరణి తప్పిదం, అధికారుల నిర్లక్ష్యం వల్లనే పొగాకు మహేందర్ మృతి చెందాడని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు పొగాకు మహేందర్ కు ఉండబడిన భూమిని తక్షణమే పట్టాకు ఎక్కించి, రైతు బీమా ఇప్పించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు. ఇదిలా ఉండగా తమ పేరు ధరణిలో వచ్చినా తమకు అధికార పార్టీ నాయకుల అండ ఉందని, నీవు ఏమి చేసినా తమకేమీ కాదని పలుమార్లు మహేందర్ ను హెచ్చరించినట్లు కూడా తెలుస్తోంది. అదేవిధంగా పోలీసు స్టేషన్ లో కూడా తమ అధికార పార్టీ నాయకులమినా మాకు ఏవిధమైన కేసులు కావని పైగా నీపైనే కేసు నమోదు చేస్తామని బెదిరించడంతో మరింత మానసికంగా కృంగి పోయి తీవ్ర అనారోగ్యానికి గురై తన తుది శ్వాస విడిచారని ఆరోపిస్తున్నారు. హసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో నిందితులపై కేసు నమోదైన అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఇప్పటికైనా ధరణీలో మహేందర్ పేరు ఎక్కించి రైతుబీమా అందించాలని భార్య సునీత , కూతుర్లు వర్శిత, హిమశ్రీ అధికారులను వేడుకుంటున్నారు.