సోషల్ మీడియా వేదికగా పోస్టుల యుద్ధం
వరంగల్ వాయిస్, డోర్నకల్: డోర్నకల్ యాదవ కులంలో ముసలం పుట్టింది. గొర్రెల పెంపకదారుల సహకార సంఘం కమిటీ ఇందుకు వేదికైంది. ఆ సంఘానికి మండల చైర్మన్ గా పనిచేసిన కేశబోయిన మల్లేశం పదవీ కాలం ముగిసిందని, ప్రస్తుతం కమిటీ బాధ్యతలు పశు వైద్యధికారి సురేష్ కు ఇవ్వడంతో తదుపరి ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు ఇన్ చార్జి చూస్తారని మాజీ ఎంపీటీసీ కొత్త రాంబాబు నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయంపై గొర్రెల పెంపకదారులు కొందరితో కలిసి కలిసి బుధవారం పశు వైద్యుడు సురేష్ కు వినతి పత్రం అందించారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో సందేహాలను డాక్టర్ ను కలిసి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ విషయంపై రికార్డైన వీడియోను కొందరూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనిపై కేశబోయిన మల్లేశం ఘాటుగా స్పందించారు. డోర్నకల్ మండల గొర్రెల పెంపకదారుల సహకార సంఘం కమిటీ పదవీ కాలం ముగిసిందని, యాదవ సంఘం సమావేశం ఉందని యాదవ సోదరులను పిలిచి గొర్రెల సొసైటీ పేరుతో స్థానిక పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లడం జరిగిందని, వెటర్నరీ డాక్టర్ ద్వారా పదవీ కాలం పూర్తి అయిందని, పాత వాళ్లకు సంబంధం లేదని డాక్టర్ బలవంతంగా చెప్పించే ప్రయత్నం చేశారని వివరించారు. 1996¬2006 వరకు తన సోదరుడు కేశబోయిన కోటిలింగం, శ్రీ గోకుల గొర్రెల సమైక్య సంఘం అధ్యక్షుడిగా కొనసాగగా, తర్వాత సంఘం సభ్యులగా ద్వారా అధ్యక్షుడి ఎన్నుకోబడ్డారని తెలిపారు. రాష్ట్ర గొర్రెల పంపిణీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన గైడ్ లైన్స్, రూల్స్ తెలియకుండా స్వలాభం కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. 354 మంది గల సంఘంలో వారి అభ్యున్నతికి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. సంఘం లెక్కలు, వాటి ఆడిటింగ్ జరుగుతున్నాయని, ప్రభుత్వ ఆదేశాల మేరకే కొనసాగుతామన్నారు. యాదవుల మధ్య ఐక్యత చెడగొట్టాలని ప్రయత్నిస్తే సహించమన్నారు.
