వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తు లు ఉన్నాయని ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా ఏక కాలంలో హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాలలోని శ్రీనివాస్ బంధువుల ఇళ్లల్లో కూడా ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు. పక్క సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులకు విస్తుపోయే విషయాలు తెలిసినట్లు సమాచారం. సోదాల సందర్భంగా నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలసింది. అయితే లెక్కకు మించిన ఆస్తులున్నట్లు ఏసీబీ సోదాల్లో వెల్లడయినట్లు ప్రచారం సాగుతోంది. రూ.50 కోట్లకు పైగా ఆస్తులను శ్రీనివాస్ కూడబెట్టినట్లు ఏసీబీ విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
