Warangalvoice

Warangal Voice

డిల్లెం బల్లెం.. బీరన్నకు బోనం

  • తొలి ఏకాదశి వేళ అంగరంగ వైభవంగా ఉత్సవం
  • పల్లె, పట్టణాల్లో కురుమల సందడి
  • అన్ని ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి
  • కరీమాబాద్‌ బీరన్న బోనాలు
  • ప్రత్యేక ఆకర్షణ


‘‘డిల్లెం బల్లెం.. అంటూ డప్పుచప్పుళ్ల మోతలు.. బీరన్న బీరన్న.. అంటూ కురుమ కులస్థుల ఆనందోత్సాహాలు.. నేత్రపర్వంగా వందలాదిగా బయలుదేరే బోనాలు..’’ తొలి ఏకాదశి రోజు కురుమలు సంప్రదాయంగా బీరన్న బోనాల పండుగను వైభవంగా జరపుకుంటారు. వారికే ప్రత్యేకమైన ఈ పండుగను పల్లె, పట్టణాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. బోనాల పండుగ సందర్భంగా ప్రతీ కురుమ ఇల్లు చిన్నాపెద్దా, పిల్లలు, బంధువులతో కళకళలాడుతుంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా కురుమ వాడల్లో జరిగే ఈ బోనాల యాత్రల్లో వరంగల్‌ నగరంలోని కరీమాబాద్‌, రంగశాయిపేట, కాశిబుగ్గ, ఉర్సు ప్రాంతాల్లో జరిగే వేడుకలు ప్రత్యేకమైనవి. వీటిని చూడడానికి వందలాదిగా తరలివస్తారు. రేపు(ఆదివారం) జరుగబోయే బీరన్న బోనాల పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
-వరంగల్‌ వాయిస్‌, కల్చరల్‌

వరంగల్‌ వాయిస్‌, కల్చరల్‌: తొలి ఏకాదశి రోజు కురుమ కులస్తులు బీరన్నకు బోనాలు చెల్లిస్తారు. ప్రతీ యేటా ఇదే రోజు ఘనంగా బోనాల పండుగ జరుపుకుంటారు. గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో ఉంటే గొల్ల కురుమలు.. ఆనవాయితీగా జరుపుకుంటారు. వారం పది రోజుల నుంచే కురుమల ఇండ్లల్లో బీరన్న బోనాల సందడి మొదలవుతుంది. బీరన్న దేవాలయాలకు కమిటీలను ఏర్పాటు చేసుకోవడం, బీరన్న గుడికి రంగులు, సున్నం వేసి శుద్ధి చేయడం లాంటి పనులు మొదలుపెడతారు. ఇక ప్రతి కురుమ కులస్థుడు కూడా ఏడాది పొడుగునా మంచి జరగాలని, పిల్ల, పాప, గొడ్డు గేదె బాగుండాలని మొక్కుకుంటారు. కురుమల కులవృత్తి అయిన గొర్రెలు, మేకలు కాయడం. తమకు సంపదనిచ్చే గొర్రెలకు, మేకలకు ఎలాంటి రోగాల రాకుండా చల్లంగా చూడు బీరన్న అని చేసుకునే పండుగే ఇది. అందుకే అన్ని పండగలకంటే తొలి ఏకాదశి బీరన్న బోనాల పండగను అంగరంగ వైభవంగా కురుమ కులస్థులు జరుపుకుంటారు.
కురుమ కులస్థుల పండుగ..
కురుమ కులస్థుల కులదైవం బీరన్న. మహిమగల్ల బీరన్నను వేడుకుంటే అన్ని సవ్యంగా జరిగిపోతాయని వీరి నమ్మకం. పసుపు బండారి తోనే బీరన్నను కొలుస్తారు. ఆ బండారిలోనే బీరన్న కొలువై వున్నాడని విశ్వసిస్తారు. గొర్రెలను కాసే కురుమ కులస్థులకు అన్ని వేళల బీరన్నే అండగా ఉంటాడని ఆది నుంచి నమ్ముతూ వస్తున్నారు. ఇలా వందల ఏళ్లుగా బీరన్నకు తొలి ఏకాదశి నాడు బోనం చెల్లించి.. గావు పట్టి గొర్రెలను బలిస్తారు. కొడుకు కోడళ్లను, బిడ్డ, అల్లులను ఇంటికి పిలుచుకొని పండుగ చేసుకుంటారు.
బోనం తయారీ..
బీరన్నకు బోనం చెల్లించే వరకు ఉపవాసంతోనే వుంటారు. కొత్త కుండలోనే బోనం వండుతారు. బీరన్నకు చెల్లించే నైవేద్యాన్ని.. పాలు, బెల్లం,బియ్యంతో బెల్లన్నం తయారు చేస్తారు. మరో చిన్న కుండలో షాక తయారు చేస్తారు. బెల్లన్నం ఉన్న కుండపై షాక వున్న కుండను ఉంచుతారు. దానిపై మూత పెట్టి నూనె దీపం వెలిగిస్తారు. దీన్నే బోనం అంటారు. అయితే కుండలకు పై భాగాన ముందుగా పసుపు రాసి దానిపై బియ్యం పిండి, పసుపు తో చారల ముగ్గు వేసి అందంగా ముస్తాబు చేస్తారు. పువ్వులను, వేప రిమ్మలను మామిడి చెట్ల రిమ్మలను పెడ్తారు. అగరుబత్తులను వెలిగిస్తారు. ఇంట్లో దేవుడి ముందు పెట్టి కొబ్బరికాయ కొడతారు.
బోనం యాత్ర..
ఇక కురుమ డొళ్లు ఇంటి ముందుకు రాగానే.. ఆ ఇంటి ఇల్లాలు.. బోనం ఎత్తుకొని వీధి గుమ్మం బయట అడుగు పెట్టె సమయంలో ఇంటి యజమాని లేదా భర్త బిందేడు నీటిని పాదాలపై పోసి బీరన్న బోనాన్ని సాగనంపుతడు. ఇలా డోలు చప్పుళ్ల నడుమ బీరన్న బోనాలు బయలు దేరుతాయి. ఒక్కొక్కరి ఇంటి నుంచి బయలుదేరిన బోనాలు.. కూడళ్ల వద్ద కలుస్తాయి. అక్కడి నుంచి బీరన్న ఆలయానికి మరింత సంబరంగా వెళ్తారు కురుమ కులస్థులు.
అన్ని కులాలకు ఇష్టమైన పండుగ..
బీరన్న బోనాలు కురుమ కులస్థుల సొంతం. కానీ కురుమలే కాదు అన్ని కులాలు వారు బీరన్న బోనాలను భక్తి శ్రద్ధలతో ఆలకిస్తారు. కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, మేర, పద్మశాలి, బెస్త, రెడ్డి అని వేరు వేరుగా కులాలు వున్న బీరన్న ను మొక్కడానికి, బోనాల పండుగ చూడ్డానికి వస్తుంటారు. బీరన్న నూలు కంకణం కోసం పోటీ పడుతుంటారు. మహిమగల్ల బీరన్న ను మొక్కితే కోరిన కోర్కెలు తీరుతాయని, సంతానం, చదువు, ఉద్యోగాల్లో సెటిల్‌ అవుతారని నమ్ముతుంటారు. మిగతా కులాల వారు కూడా బీరన్నకు కొబ్బరికాయ కొట్టి మొక్కులు, పసుపు బండారి బొట్టు పెట్టుకుంటారు.

ఆద్యంతం ఉత్సాహభరితం..
-మండల నర్సింహా,
ఆలయ కమిటీ అధ్యక్షుడు, రంగశాయిపేట
బీరన్న ఉత్సవాల్లో కంకణధారణ, బోనాల సమర్పణ ప్రధాన ఘట్టాలుగా ఉంటాయి. కురుమల ఆరాధ్య దైవమైన బీరన్నస్వామికి బోనాల ఉత్సవాలు ప్రతి యేడు నగరంలో ఉత్సాహభరితమైన వాతావరణంలో నిర్వహిస్తాం. బీరన్నస్వామివారికి ఉదయం ప్రత్యేక అభిషేకాలు, పూజలు, సాయంత్రం బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటాం.
వందల ఏళ్లనుంచి బోనాలు..

మరుపల్ల రవి, ఆలయ కమిటీ చైర్మన్‌, ఉర్సు
కురుమల ఆరాధ్య దైవమైన బీరన్నకు వందల ఏళ్ల నుంచి బోనాలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. డప్పు వాయిద్యాలు, బీరన్నల విన్యాసాలతో బోనాల ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతాయి. అందరి సహాయ, సహకారాలతో ప్రతి ఏటా బీరన్నస్వామి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం.
ప్రత్యేక ఏర్పాట్లు..
-కోరె కృష్ణ,కమిటీ అధ్యక్షుడు, కరీమాబాద్‌
కురుమల ఆరాధ్య దైవమైన బీరన్న దేవాలయంలో భక్తులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు బీరన్నకు బోనం సమర్పించేలా ఏర్పాట్లు చేశాం. తొలి ఏకాదశి రోజున నిర్వహించే ఈ బోనాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు.
ఘనంగా ఏర్పాట్లు..

కంచ సంపత్‌,
ఆలయ కమిటీ అధ్యక్షుడు, కాశిబుగ్గ
తొలి ఏకాదశి పర్వదినం రోజున కాశిబుగ్గలోని 19 డివిజన్‌లో కొలువై ఉన్న బీరన్న స్వామికి అంగరంగవై భవంగా బోనా లు సమర్పించు కోవడం ఆనవాయితీగా వస్తోంది. కురుమ కులస్థులంతా సాయంత్రం బోనాలతో బీరన్న స్వామి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. ఘనంగా ఏర్పాట్లు చేశాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *