Warangalvoice

Warangal Voice

జర జాగ్రత్త..

  • అడుగుకోగుంత.. ఆదమరిస్తే తంటా
  • వర్షపునీటితో నిండిన గుంతలు
  • మహా నగరంలో రోడ్లపై పొంచి ఉన్న ప్రమాదం
  • చొద్యం చూస్తున్న బల్దియా
  • స్టేషన్‌ రోడ్‌ లో పెద్ద గుంతను పూడ్చిన ట్రాఫిక్‌ పోలీసులు

మహా నగర ప్రజలు అడుగు బయట పెట్టాలంటేనే వణుకు పుట్టే పరిస్థితి నెలకొంది. నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఎక్కడ గుంత ఉందో.. అది ఎంత లోతు ఉంటుందో తెలియక వాహనదారులు తికమక పడుతున్నారు. రాత్రి వేళల్లో ఈ పరిస్థితి మరీ దయనీయం. ఆదమరిచి ముందుకుపోతే ఆస్పత్రి పాలుకాక తప్పడం లేదు. ప్రధాన రహదారులపైనున్న గుంతల్లో నిత్యం పదుల సంఖ్యలో వాహనదారులు పడుతున్నా బల్దియా పాలకులు మాత్రం చోద్యం చూస్తున్నారు. అయితే వరంగల్‌ ట్రాఫిక్‌ పోలీసులు గుంతల్లో కంకర, మట్టి పోస్తూ తమ ఔదార్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌ పోలీసులకు ఉన్న సోయి బల్దియా పాలకులకు లేకుండా పోయిందంటూ బాటసారులు, వాహనదారులు బహిరంగంగానే తిట్టుకుంటున్నారు. ఇంటినుంచి ఎవరైనా బయటికి వెళుతున్నారంటే జర జాగ్రత్త అంటూ హెచ్చరికలు చేసే పరిస్థితి నెలకొంది.
-వరంగల్‌ వాయిస్‌, వరంగల్‌ ప్రతినిధి

వరంగల్‌ వాయిస్‌, వరంగల్‌ ప్రతినిధి: అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు తడిసి ముద్దవుతున్నాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. చెరువులు, కుంటలు అలుగు బారుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. వరద నీటితో పలు పట్టణాలు జలమయమయ్యాయి. అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లేవాళ్లు తడిసి ముద్దవుతున్నారు. గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మురికి కాలువలు పొంగి పొర్లుతున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలు ప్రమాదపుటంచుల్లో ఉన్నాయి. దీంతో బల్దియా అధికారులు 24గంటల కంట్రోల్‌ రూంతోపాటు ఎన్‌డీఆర్‌ ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు. ఇంత చేస్తున్న గ్రేటర్‌ అధికారులు, పాలకులు ప్రధాన రహదారిపైనున్న గుంతలను మాత్రం విస్మరించారు.
అడుగుకోగుంత..
వరంగల్‌ నగరంలోని ప్రధాన రహదారులన్నీ గుంతల మయంగా మారాయి. గుంతలతో అడుగు తీసి అడుగు వేయాలంటేనే వణుకు పుట్టే పరిస్థితి నెలకొంది. ఎక్కడ గుంత ఉంటుందో..అది ఎంత మేరకు వ్యాపించి ఉంటుందో తెలియక వాహనదారులు తికమక పడుతున్నారు. వర్షపు నీటితో నగరంలోని గుంతలన్నీ నిండుకోవడంతో విషయం తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. బల్దియా అధికారులు నిర్లక్ష్యంతో నిత్యం పదుల సంఖ్యలో ఈ గుంతల్లో పడి ప్రాణాప్రాయ స్థితికి చేరుతున్నారు. వరంగల్‌ అండర్‌ బ్రిడ్జినుంచి వరంగల్‌ చౌరస్తా వరకు ఇరువైకి పైగా గుంతలు ఉన్నాయి. ఒక్క వరంగల్‌ చౌరస్తాలోనే పదికిపైగా గుంతలు ఉన్నాయంటే బల్దియా అధికారుల తీరు ఎలా ఉందో అర్థమవుతోంది.
వరంగల్‌ చౌరస్తాలోనే..
ఒక్క వరంగల్‌ చౌరస్తాలోనే పదికి పైగా ఉన్న గుంతలు అధికారులు, పాలకుల పనితీరుకు అద్దం పడుతోంది. మామూళ్లకు ఆశపడి పెద్ద పెద్ద భవనాలకు, షాపింగ్‌ మాళ్లకు అనుమతులిస్తున్న గ్రేటర్‌ పాలకులు కనీసం రహదారి సౌకర్యం కల్పించకపోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షాపింగ్‌ మాళ్లు పడినప్పటినుంచి ట్రాఫిక్‌ పెరిగిపోయి గతంలో ఉన్న రహదారులు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. వరంగల్‌ చౌరస్తానుంచి ఎటు వైపు వెళ్లాలన్నా వాహనదారులు సర్కస్‌ ఫీట్లు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కొంత కాలంగా ఇదే పరిస్థితి నెలకొన్నా పట్టించుకునేవారే కరువయ్యారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా వారికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం శోచనీయం.
అండర్‌బ్రిడ్జి ప్రాంతంలో..
ప్రమాదాలకు అండర్‌బ్రిడ్జి ప్రాంతం నిలయంగా మారింది. ఫీటు నుంచి రెండు ఫీట్ల లోతులో ఏర్పడిన గుంతలు బాటసారులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొత్తవారు ఎవరైనా నీరే కదాని తమ వాహనాన్ని ముందుకు పోనిస్తే వారు ఆస్పత్రి మెట్లు ఎక్కాల్సిందే. అండర్‌ బ్రిడ్జి నుంచి హెడ్‌ పోస్టాఫీస్‌ వరకు ఆరుకుపైగా గుంతలు ఉన్నాయి. వాహనదారులు ఎవరైనా ఒక గుంతనుంచి తమ వాహనాన్ని తప్పించినా రెండో గుంతలో పడాల్సిందే.
వరద ఉధృతి..
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద పెరగడంతో ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. కాళేశ్వరం వద్ద మేడిగడ్డ లక్ష్మి బ్యారేజి వద్ద 8,95,330 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 81 గేట్లు ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చిన ట్లుగానే యథావిధిగా కిందకు పంపిస్తున్నారు. ఈ వరద ప్రవాహంతో పాటు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కిందికిపోతుంటే వరద ప్రవాహం మరింతగా పెరిగింది. వాటికి తోడు ములుగు జిల్లా ప్రాంతానికి వచ్చిన వరదలు గోదావరిలో చేరడంతో ఏటూర్‌నాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్‌ వద్ద 16 మీటర్లకు పైగా వరద ప్రవహిస్తుండటంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఏటూర్‌నాగారం మండలంలోని రామన్నగూడెం, రాంనగర్‌, లంబాడి తండా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 163వ జాతీయ రహదారిలో ఏటూర్‌నాగారం మీదుగా చత్తీస్‌గఢ్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో ఉధృతంగా వరదలు ప్రవహిస్తుండటంతో చత్తీస్‌గఢ్‌కు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. మహాదేవపూర్‌ పలిమెల మండలానికి పూర్తిగా బాహ్య సంబంధాలు తెగిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *