
వడ్డీతోసహా గ్రాంట్‌ను మింగిన ఘనులు
రూ.3 కోట్లు స్వాహా..
అవినీతికి పాల్పడిన చేనేత సహకార సంఘం అధ్యక్షులు
త్రిపుల్ ఆర్ స్కీం ద్వారా డబ్బులు మంజూరు
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన ఆడిట్ అధికారులు
చక్రం తిప్పిన వరంగల్ జిల్లా సహకార కార్యాలయ అసిస్టెంట్ రిజిస్ట్రార్
చేనేత కార్మికుల సంక్షేమాన్ని అటకెక్కించారు.. వారికి చేతినిండా పని కల్పించాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలను నీరుగార్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 15 చేనేత సహకార సంఘాలకు గ్రాంటు రూపేణా అందజేసిన డబ్బులతోపాటు దానిపై వచ్చిన వడ్డీని సైతం దిగమింగారు. అందుకు వరంగల్ జిల్లా చేనేత సహకార కార్యాలయ అధికారులను పావులుగా వాడుకున్నారు. వారికి అంతో ఇంతో ముట్టజెప్పి పైసా ఖర్చు చేయకుండా, కనీసం బిల్లులు కూడా లేకుండానే ఆడిట్ చేయించుకున్నారు. చేసేదే మనం.. మనల్ని ఎవరు ప్రశ్నిస్తారు అనుకున్న అధికారులు సైతం చేనేత సహకార సంఘం అధ్యక్షులు ఇచ్చే ఆమ్యామ్యాలకు ఆశపడి చూసీచూడనట్లు సంతకం చేశారు. దీంతో ప్రభుత్వం మంజూరు చేసిన గ్రాంటు, వడ్డీతో కలుపుకొని సుమారు రూ.3కోట్లు సహకార సంఘాల అధ్యక్షుల జేబుల్లోకి వెళ్లింది. ఈ మొత్తం తతంగం వరంగల్ జిల్లా సహకార కార్యాలయంలోని అసిస్టెంట్ రిజిస్ట్రార్ కనుసన్నల్లోనే జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
-వరంగల్ వాయిస్, వరంగల్ ప్రధాన ప్రతినిధి
వరంగల్ వాయిస్, వరంగల్ ప్రధాన ప్రతినిధి : అప్పుల్లో కూరుకుపోయిన చేనేత సహకార సంఘాలకు చేయూతనిచ్చి వారి కాళ్లమీద వారు నిలపడేలా చేయాలన్న లక్ష్యంతో 2012-13 సంవత్సరంలో అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంలో త్రిపుల్ ఆర్ (పునరుద్ధరణ, పునఃసంస్కరణ, పునఃనిర్మాణం) పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా మంజూరైన కాంపొనెంట్ డబ్బులతో సంఘం ఇతరులకు ఇవ్వవలసిన అప్పులు, ఆడిట్ ఫీజు, ప్రభుత్వ వాటా ధనం, నేత కూల్లు చెల్లించడంతోపాటు సంఘ ఆవరణలో నూతనంగా బిల్డింగ్ నిర్మించుట, పాత బిల్డింగ్ మరమ్మతులు చేయుట, మగ్గములు, ఇతర పరికరాలను ఖరీదు చేసేందుకు వినియోగించాలంటూ నిబంధన పెట్టారు. అదే విధంగా అప్పటి వరకు ఉన్న నికర నష్టాన్ని తీసివేయాలని సూచించింది. దీంతో అప్పుల్లో ఉన్న చేనేత సహకార సంఘాలన్నీ తిరిగి లాభాల్లోకి అడుగు పెట్టాలన్న గొప్ప లక్ష్యంతో ప్రభుత్వం త్రిపుల్ ఆర్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా వచ్చిన కాడికి సొంతానికి వాడుకున్నారు. ఒక్కపైసా కార్మికులకు ఇచ్చింది లేదు..అప్పులు కట్టింది లేదు. కొందరు ఈ డబ్బులతో సంఘం స్థలంలో కట్టాల్సిన భవనాన్ని తన సొంత స్థలంలో ఇంటిని నిర్మించుకోగా, మరి కొందరు తమ సొంత స్థలంలో వర్క్ షెడ్ నిర్మాణాన్ని పూర్తి చేసి అక్కడే మర మగ్గాలు వేసి సొంత వ్యాపారాలు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 15 సంఘాలు..
త్రిపుల్ ఆర్ పథకం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని మొత్తం 15 చేనేత సహకార సంఘాలకు రూ.2,45,25,000 మంజూరు చేశారు. ఇందులో శాయంపేట చేనేత సహకార సంఘానికి అత్యధికంగా రూ.56లక్షలు మంజూరు కాగా అతి తక్కువగా పెంచికలపేట చేనేత సహకార సంఘానికి రూ.3.70లక్షలు మంజూరయ్యాయి. అదే విధంగా పెద్దకోడెపాక (కొప్పుల) చేనేత సహకార సంఘానికి రూ.19.05లక్షలు, చెర్లపల్లికి రూ.24.41, పర్కాలకు రూ.20.81, రాయపర్తి (నవారు) రూ.10.05లక్షలు, రాయపర్తి (హైండ్లూమ్) రూ.17.96, వెల్లంపల్లికి రూ.4.27లక్షలు, నాగారం (పర్కాల)కు రూ.21.74లక్షలు, నాచనిపల్లికి రూ.11.55లక్షలు, రేలకుంటకు 9.63లక్షలు, ఇల్లంద (వర్ధన్నపేట)కు 8.89లక్షలు, మొగుళ్లపెల్లికి రూ.15.29లక్షలు, రేగొండకు రూ.12.46లక్షలు, చల్లగరిగె చేనేత సహకార సంఘానికి రూ.9.44లక్షలు మంజూరు చేశారు.
నిబంధనలకు నీళ్లు..
త్రిపుల్ ఆర్ స్కీం ద్వారా మంజూరైన రూ.2.45కోట్ల గ్రాంటును ప్రభుత్వం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, సుబేదారి, హన్మకొండ శాఖలో జమ చేసింది. ఈ మొత్తాన్ని ఐదు సంవత్సరాలపాటు ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. 2018-19 సంవత్సరంలో వడ్డీతో కలిపి రూ.3కోట్లకు చేరుకుంది. అప్పటి వరంగల్ జిల్లా చేనేత, జౌళి శాఖ వరంగల్ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభుత్వం ఇచ్చిన త్రిపుల్ ఆర్ స్కీం గైడ్ లైన్స్ పాటించకుండా ఫిక్స్ డ్ చేసిన డబ్బులను వడ్డీతో కలిపి సదరు చేనేత సహకార సంఘాలకు విడుదలు చేయాల్సిందిగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకునకు సిఫారసు చేశారు. దీనికోసమే ఎదురు చూస్తున్న సదరు సంఘాల అధ్యక్షులు అట్టి డబ్బులను మొత్తం డ్రా చేసి సొంత ఖాతాల్లో జమచేసుకున్నారు. దీంతో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా డబ్బులను సంఘాల ఖాతాలో జమ చేయాలంటూ సిఫారసు చేసిన అప్పటి అసిస్టెంట్ డైరెక్టర్ జి.రమేష్ 2019లోనే సస్పెండ్ అయ్యారు.
సొంత పనులకే గ్రాంటు నిధులు..
చేనేత సహకార సంఘాల అధ్యక్షులు త్రిపుల్ ఆర్ స్కీం గైడ్ లైన్స్ పాటించలేదు. ప్రభుత్వం మంజూరు చేసిన సొమ్మును సొంత ఖాతాలోకి జమ చేసుకున్నారు. వారి సొంత అప్పులను తీర్చుకున్నారు. పెద్ద మొత్తంలో వచ్చిన నిధులతో సొంతంగా ప్లాట్లు కొనుకున్నారు. కొందరు సొంత స్థలంలో భవంతులను నిర్మించుకున్నారు. సొంతంగా వ్యాపారాలు చేశారు. అంతే తప్ప చేనేత కార్మికుల అభ్యున్నతికి ఏ ఒక్కరు కూడా పాటుపడలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం మంజూరు చేసిన 15 సంఘాల్లో ఏ ఒక్క సంఘానికి చెందిన పాత భవనాన్ని మరమ్మతు చేయలేదు..కొత్తది కట్టలేదంటే అవినీతి ఎంతమేర జరిగిందో అర్థమవుతోంది.
ఆడిట్‌లోనూ తప్పులే..
ప్రభుత్వం విడుదల చేసిన గ్రాంటుకు సంబంధించిన వివరాలు ఏ ఒక్క సంఘం రికార్డులోనూ నమోదు చేయలేదు. దీంతో 2018-19, 2019-20 చెందిన ఆడిట్ ఆలస్యంగా జరిగింది. నిబంధనల ప్రకారం 2018-19కంటే ముందు ఆడిట్ రిపోర్టులో ఉన్న అప్పులు, చెల్లింపులు అన్ని ప్రభుత్వం మంజూరు చేసిన గ్రాంటుతో చెల్లించి వాటిని జీరో చేయాల్సి ఉంది. కాని ఏ ఒక్క కాంపోనెంట్ కూడా పోలేదు. 2017-18 సంవత్సరంలో ఆడిట్ రిపోర్టు ఎలా ఉన్నదో 2018-19, 2019-20లో కూడా అలాగే ఉంది. ఇతరులకు ఇవ్వవలిసిన బాకీలు, ఆడిట్ ఫీజు, ప్రభుత్వ వాటా ధనం, నికర నష్టం, నేత కూల్లు చెల్లించుపులు ఏమీ జరుగలేదు.
చక్రం తిప్పిన అసిస్టెంట్ రిజిస్ట్రార్..
చేనేత సహకార సంఘాలకు చెందిన ఆడిట్‌ను ఆడిటర్ వి.జ్యోతి, సీనియర్ ఇన్‌స్పెక్టర్ ఎస్.వీరేష్ బాబు, జూనియర్ ఇన్‌స్పెక్టర్, ఆడిటర్లు ఆడిట్ చేయాల్సి ఉన్నా ఆ నిబంధనలకు తిలోదకాలు పలికారు. ఈ మొత్తం వ్యవహారాన్ని అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఒంటిచేత్తో హ్యాండిల్ చేశారు. చేనేత సహకార సంఘాల అధ్యక్షులు ఇచ్చే పర్సంటేజీలకు ఆశపడి తప్పుడు పద్ధతిలో ఆడిట్ చేశారు. త్రిపుల్ ఆర్ స్కీం గైడ్‌లైన్స్ ను ఎక్కడా పాటించలేదు. ఏ ఒక్కరు కూడా చేనేత కార్మికుల సంక్షేమానికి పైసా కూడా ఖర్చు చేయలేదు. సంఘం రికార్డులో లెక్కలు తప్పులు రాసిన, బిల్లులు లేకున్నా. ఎలాంటి తప్పులు జరిగిన ఆడిట్ రిపోర్టులో చూపిస్తారు. డిఫెక్ట్ షీటులో ఆ తప్పు గురించి వివరణ రాస్తూ స్పెషల్ రిపోర్టు ఇస్తారు. కాని ఇక్కడ అందుకు భిన్నంగా వ్యవహరించారు. అయినప్పటికీ మరమగ్గాలు కొన్నట్లు, కూలీలకు చెల్లించినట్లు, భవన నిర్మాణాలు చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి ఆడిట్ పూర్తి చేశారు. వీటికి సంబంధించిన బిల్లులు లేనప్పటికీ ఆడిట్ అయినట్లు నమ్మించి ఇద్దరు ఆడిట్ అధికారులతో రిపోర్టులపై సంతకాలు చేయించడంపై చేనేత, జౌళి శాఖలో పెద్ద దుమారమే లేస్తోంది.
రోడ్డున పడిన చేనేత కార్మికులు..
చేనేత కార్మికులను ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిపుల్ ఆర్ స్కీంను సంఘం అధ్యక్షులు సొంతానికి వాడుకోవడంతో గతంలో ఉన్న అప్పులు కుప్పలుగా మారి సంఘం నడుపలేని స్థితికి చేరింది. దీంతో రెక్కడితే కాని డొక్కాడని నిరుపేద చేనేత పారిశ్రామికులు జీవనోపాధి కోల్పోయారు. చేతనే నమ్ముకున్న ఎంతో మందికి ఉపాధి కరువై తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. సంఘం అధ్యక్షుడు మాత్రం గతంలో ఉన్న అప్పులను తీర్చి దర్జాగా కాలం గడుపుతుండగా కార్మికులు మాత్రం చేసేందుకు పని లేక రోడ్డున పడ్డారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి..
కాసులకు కక్కుర్తిపడి తప్పుడు ఆడిట్ చేసిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ సి.నాగ నారాయణపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని చేనేత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆడిట్ రిపోర్టులో తప్పులు చూపించి చేనేత కార్మికుల పొట్ట కొట్టిన సదరు రిజిస్ట్రార్ చేసిన ఆడిట్‌ను మరోసారి పరిశీలించాలని కోరారు. ప్రభుత్వం మంజూరు చేసిన గ్రాంటును కార్మికులందరికీ పంచాలని డిమాండ్ చేస్తున్నారు.