- గంగాజలం కోసం మొస్రం వంశస్థుల యాత్ర
- ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
వరంగల్ వాయిస్,ఆదిలాబాద్: ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటైన నాగోబా జాతరకు మెస్రం వంశస్తులు అంతా సిద్దం చేస్తున్నారు. ఇందుకోసం అట్టహాసంగా ఆలయ ప్రారంభోత్సవ పూజలు ఇప్పటికీ ప్రారంభించారు. ఆదివాసీల ఆరాధ్య దేవుడు నాగోబాకు మెస్రం వంశస్థులు 5 కోట్లతో నిర్మించిన ఆలయ ప్రారంభోత్సవ పూజలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాజగోపురం, దేవాలయ పునరుద్ధరణ, మండప ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఏళ్ల నాటి కళ నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసిన నిధులతో నాగోబా ఆలయం సౌకర్యాలతో కళకళాడనుంది. ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల నుంచి వేలాదిగా తరలివచ్చిన మెస్రం వంశస్థుల సమక్షంలో ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు, ఆయన భార్య లక్ష్మి నవగ్రహ పూజలు చేశారు. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం నుంచి తీసుకువచ్చిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను, ఆదివాసీ గిరిజన తెగలోని మహరాజ్‌లు వేదమంత్రాల మధ్య నిర్వహించారు. పుష్యమి అమావాస్య రోజున నాగోబా దేవుడికి మహాపూజలతో జాతరం ప్రారంభం కానుంది. సర్పజాతిని పూజించడమే ఈ జాతర ప్రత్యేకత. పుష్యమి అమావాస్య రోజున తమ ఆరాధ్య దైవమైన నాగోబా పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల నమ్మకం. పాలు తాగి తమని ఆశీర్వదిస్తారని విశ్వాసం.ఏజెన్సీలో నాగోబా జాతర సందడి మొదలైంది. గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే ఈ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా పుష్యమాసంలో ఈ జాతర కోలాహలం కనిపిస్తుంది. ఇప్పటికే కెస్లాపూర్‌లో నాగోబా జాతర కోసం గంగాజలం యాత్ర ప్రారంభమైంది. జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. నాగోబా దేవత మెస్రం వంశీయుల ఆరాధ్య దైవం. మహాపూజ కోసం నిర్వహించే గంగాజలం తీసుకువచ్చేందుకు రావాలంటూ మెస్రం వంశస్తులు గ్రామంలో ప్రచారం చేస్తూ, రథంలో తిరుగుతూ వారం రోజులు ఆహ్వానిస్తారు. పుష్యమాసం అమావస్య రోజున గంగాజలంతో నాగోబాకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సమ్మక్క, సారలమ్మల తరువాత రాష్ట్రంలోనే పెద్దదైన నాగోబాకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన దేవాలయంగా నిలిచిపోనుంది. నాగోబా జాతరకు వచ్చే భక్తులకు, ఆదివాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నట్లు తెలిపారు. నాగోబా జాతర అభివృద్ధికి నిధులు మంజూరు చేయించిన మంత్రులకు, ఎంపీ, ఎమ్మెల్యేలకు పంచాయతీ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. నిధుల విడుదలతో ఏళ్ల నాటి కల నెరవేరుతుందన్నారు. దీంతో త్వరలో ప్రారంభమయ్యే నాగోబా జాతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జాతర ఏర్పాట్ల ప్రత్యేక సమావేశంలో ఆయాశాఖలకు అప్పగించిన పనులను చేయిస్తున్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో మర్రిచెట్ల వద్ద కోనేరు నిర్మాణ పనులు చేపట్టారు. కోనేరు నిర్మాణం పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. జాతరకు వచ్చే భక్తులకు తాగునీటికి ఇబ్బందులు కలగకుండా జాతర ఆవరణతోపాటు నాగోబా ఆలయానికి వెళ్లే రహదారి పక్కన ప్రత్యేకంగా ప్రత్యేకంగా నల్లాలను ఏర్పాటు చేస్తున్నారు. నల్లాల నీరు వృథాగా పోకుండా ఇంకుడు గుంతలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. మరుగుదొడ్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జాతర సమయానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. జాతరకు వచ్చే భక్తులతోపాటు మెస్రం వంశీయులకు శాశ్వతమైన తాగునీటి సౌకర్యం కల్పించేందుకు పైపులైన్ నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. జాతరలో పూర్తిగా ప్లాస్టిక్ సంచులను నిషేధించాలని గిరిజన సహకార సంస్థ ద్వారా కాగితపు సంచులు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతర కోసం రూపొందించిన వాట్సాప్‌లో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. నాగోబా జాతరలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఐటీడీఏ పివో అన్నారు. పుష్యమి అమావాస్య రోజున నాగోబా దేవుడికి మహాపూజలతో జాతరం ప్రారంభం కానుంది.
