భవితశ్రీ మేనేజింగ్ డైరెక్టర్ తాటిపల్లి శ్రీనివాస్
వరంగల్ వాయిస్, హనుమకొండ: క్యాసినో చికోటి ప్రవీణ్ తో తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నామని అతడికి తమకు ఎలాంటి సంబంధం లేదని భవితశ్రీ మేనేజింగ్ డైరెక్టర్ తాటిపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బుధవారం హన్మకొండ అమృత థియేటర్ పరిధిలోని భవితశ్రీ చిట్ ఫండ్ బ్రాంచ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్యాసినో చికోటి ప్రవీణ్ కి తమకు ఎలాంటి సంబంధం లేదని తమ సంస్థతో ఎలాంటి ఆర్థిక సంబంధం లేదన్నారు. వైశ్య సామాజిక వర్గం సమావేశంలో చికోటి ప్రవీణ్ పాల్గొన్నాడని, చిన జీయర్ స్వామితో చికోటి ప్రవీణ్ కు భక్తిపరమైన పరిచయం ఉందని అలా పేద వైశ్య కుటుంబాలకు చేయూతనందించడానికి ఆయనను సంప్రదించడం జరిగిందన్నారు. తమ సామాజిక వర్గం వాళ్ళని ఆధ్యాత్మిక సేవలో భాగంగా యాగంలో పాల్గొన్నప్పుడే ఆయన గురించి తెలిసిందన్నారు. తమ వాసవి బిజినెస్ గ్రూప్ ఆర్గనైజేషన్ సేవ సంస్థకు రూపాయలు రూ.2లక్షల ఆర్థిక సాయం అందజేసింది నిజమేనని తెలిపారు. వాసవి బిజినెస్ గ్రూప్ ఆర్గనైజేషన్ ద్వారా పరిచయం అయ్యాడని పేదలకు సేవచేయడం కోసమే తామూ పాల్గొనేవాళ్ళమని తెలిపారు. అతడికి తమకు ఎలాంటి సంబంధాలు లేవని కొందరు తమపై తప్పుడు వార్తలు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమం లో ఆర్గనైజేషన్ డైరెక్టర్ కొమురవెల్లి నాగరాజు, జనరల్ మేనేజర్ పిన్నింటి రాజేశ్వర్ రావు, సీఈవో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
