Warangalvoice

gang war

 గుడిసెవాసులపై గుండాల దౌర్జన్యం

  • స్థానికులు, గుడిసె వాసుల మధ్య వాదోపవాదాలు
  • కర్రలు, రాళ్లతో గుడిసె వాసులపై దాడి
  • 30మందికిపైగా గాయాలు-ఎంజీఎం తరలింపు
  • సీపీఐ ఆధ్వర్యంలో సీపీని కలిసిన నేతలు
  • రక్షణ కల్పించాలంటూ వినతి

హనుమకొండ మండలంలోని గుండ్ల సింగారం మంగళవారం రణరంగంగా మారింది. రెండు నెలలుగా గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్న నిరుపేదలపై మంగళవారం కొందరు గుండాలు ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో దాడిచేయడంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. దొరికిన వారిని దొరికినట్లు కర్రలతో బాదారు. సుమారు గంటపాటు బీభత్సం సృష్టించారు. దీంతా ఆ ప్రాంతమంతా హాహాకారాలతో నిండిపోయింది. నిరుపేద గుడిసె వాసులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. అయినా ఏ మాత్రం కనికరంలేని రియల్‌ గుండాలు గుడిసెవాసులను వెంబడిరచి దాడులు చేశారు. దీంతో సుమారు 30మందికి పైగా గాయాలయ్యాయి. పలువురికి చేతులు విరిగాయి. వీరిని హుటాహుటిన ఎంజీఎం తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.

-వరంగల్‌ వాయిస్‌, హనుమకొండ

రణరంగమైన గుండ్ల సింగారం
వరంగల్‌ వాయిస్‌, హనుమకొండ: హనుమకొండ మండలం గుండ్ల సింగారం రణరంగమైంది. రెండు నెలలుగా గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్న నిరుపేదలపై స్థానికులుగా చెప్పుకునే ‘రియల్‌’ గుండాలు మంగళవారం మూకుమ్మడిగా కర్రలు, రాళ్లు, ప్లాస్టిక్‌ పైపులు, కారంతో దాడి చేశారు. దొరికిన వారిని దొరికినట్లు చితక బాదారు. ఉదయం నుంచే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న రియల్‌ గుండాలు గుడిసెల్లోకి ఎవ్వరూ వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంప వేశారు. అటుగా వచ్చే గుడిసెవాసులను అడ్డుకుని వారిపై దాడికి యత్నించారు. దీనిని గుడిసెవాసులు ప్రతిఘటించారు. రెండు నెలలుగా ఇక్కడే గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నాం.. ఇక్కడినుంచి కదిలేది లేదంటూ ప్రకటించారు. దీంతో రెచ్చిపోయిన రియల్‌ గుండాలు విచక్షణ కోల్పోయి ఆడా, మగ తేడా లేకుండా గుడిసెవాసులపై కర్రలతో దాడి చేశారు.

ప్రభుత్వ భూమిలో గుడిసెలు..
భారత కమ్యూనిస్టు పార్టీ హనుమకొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో రెండు నెలల క్రితం గుండ్ల సింగారంలోని సర్వే నెంబర్‌ 174, 175లో ఉన్న ప్రభుత్వ భూమిలో నిరుపేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. వీరిని ఇక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు సోమవారమే రియల్‌ గుండాలు వారిని భయభ్రాంతులకు గురిచేశారు. గుడిసెల్లోకి ఎవ్వరూ వెళ్లకుండా దారికి అడ్డంగా ముళ్ల కంప వేశారు. గుడిసెవాసులపై దాడికి ప్రయత్నించగా కేయూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ రోజు ఓపిక ప్రదర్శించిన రియల్‌ గుండాలు మంగళవారం ఉదయమే పెద్ద ఎత్తున దాడి చేసేందుకు పక్కా ప్లాన్‌ వేశారు.
హాహాకారాలు..
స్థానికులుగా చెప్పుకునే రియల్‌ గుండాల దాడితో గుండ్ల సింగారం ఉద్రిక్తంగా మారింది. వారి దాడులకు భయపడి గుడిసె వాసులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. అయినా ఏ మాత్రం కనికరం చూపకుండా దాడుల పరంపర కొనసాగించారు. దీంతో ఆ ప్రాంతమంతా హాహాకారాలతో మిన్నంటింది. 30మందికి పైగా మహిళలకు గాయాలయ్యాయి. పలువురి చేతులు, కాళ్లు విరిగాయి. రంగప్రవేశం చేసిన పోలీసులు గాయపడిన వారిని ఎంజీఎం తరలించి చికిత్స అందిస్తున్నారు.
సీపీకి ఫిర్యాదు..
గుండ్ల సింగారంలో గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్న వారిపై కొందరు గూండాలు సమిండ్ల భాస్కర్‌, బోడ కిషన్‌, మాదాసు జగన్‌, మాదాసి భరత్‌, వెంకట్‌తోపాటు స్థానిక కార్పోరేటర్‌ మరికొందరు కలిసి తమపై గునపాలు, రాళ్ళు, కారం పొడితో దాడి చేశారంటూ మంగళవారం సీపీఐ హనుమకొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో వరంగల్‌ సీపీ తరుణ్‌ జోషికి ఫిర్యాదు చేశారు. 30 మందికి తీవ్రగాయాలు అయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిని ఎంజీఎం తరలించగా చికిత్స అందిస్తున్నారన్నారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, గుడిసె వాసులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.


దాడి చేసిన గుండాలను శిక్షించాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌ రావు
గుండ్ల సింగారంలో సీపీఐ నాయకులపై, గుడిసె వాసులపై అమానుషంగా దాడికి పాల్పడిన భూకబ్జాదారులకు వంత పాడుతున్న గూండాలను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌ రావు డిమాండ్‌ చేశారు. మంగళవారం గుండ్ల సింగారంలో భూ కబ్జాదారుల దాడిలో గాయపడి ఎంజీఎం చికిత్స పొందుతున్న వారిని సీపీఐ నాయకులు, జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతితో కలిసి ఆయన పరామర్శించారు. మండ సదాలక్ష్మి, సంపత్‌, గోగుల రమణ, వల్లెపు రాధ, యాదమ్మ, ఓరుగంటి లావణ్య, పీట్ల ఐలమ్మ, బొంత స్రవంతి,వడ్లకొండ రమ్య, సోమ శైలజ, బైస మౌనిక, మమత, సంద్య, కె.సంపత్‌, మాలోతు మంగా, మాలతి, కొడిపాక నందిని, సుర సరమ్మ, వైదుగుల బతుకమ్మ, బొంత స్వప్న, కాగితాల రాణి, పూజారి పద్మ, దోరి సునీత, తాటికటీ మమతా, ఎల్లయ్య తదితరులు మొత్తం 30 మందికి గాయలయ్యాయని తెలిపారు. భూమాఫియా దాడికి వెనకడుగు వేసేది లేదని, పేదలకు ఇండ్ల స్థలాలు దక్కే వరకూ పోరాడుతామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి గుండ్ల సింగారంలో భూమిపై స్పష్టమైన ప్రకటన చేయాలని, ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కోరారు. బాధితులను పరామర్శించిన వారిలో శ్రీనివాస్‌ రావుతో పాటు సీపీఐ మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, వరంగల్‌ జిల్లా కార్యదర్శి మేకల రవి, జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి, జిల్లా నాయకులు మద్దెల ఎల్లేష్‌, కర్రె లక్ష్మణ్‌, గన్నారపు రమేష్‌, కండె నర్సయ్య, మాలోతు శంకర్‌, కొట్టెపాక రవి, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి భాషబోయిన సంతోష్‌ తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *