తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కమిటీ
వరంగల్ వాయిస్, జనగామ : తెలంగాణలో బీసీ-ఈ రిజర్వేషన్ల సమస్య సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున అది పరిష్కారం అయ్యేవరకు గిరిజన రిజర్వేషన్ పెంచడం ఇప్పట్లో సాధ్యం కాదని పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కులను కాలరాయడమేనని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్య చందునాయక్ కేంద్రప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపు అంశాన్ని బీసీ-ఈ తో ముడి పెట్టడం అన్యాయమన్నారు. తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం 6 శాతం నుంచి 9.08 శాతానికి పెంచుకోవడానికి కేంద్ర హోం శాఖ అందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర గిరిజన వ్యవరాలశాఖ కోరింది. గత నాలుగు సంవత్సరాలుగా జాప్యం చేసిన కేంద్ర హోం శాఖ ఇప్పుడు బీసీ- ఈ సమస్యను గిరిజన రిజర్వేషన్ పెంపు సమస్యతో ముడిపెట్టడం బీజేపీ అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం అని అన్నారు. రాజ్యాంగబద్ధంగా గిరిజన రిజర్వేషన్లను పెంచాల్సిన కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేయడం అన్యాయం. తెలంగాణలో గత 8 సంవత్సరాల నుంచి విద్య, ఉద్యోగ రంగాల్లో తీవ్రంగా నష్టపోయిన గిరిజనులకు కేంద్రం ప్రకటన మరింత వేదనకు గురిచేసింది. రాష్ట్ర ప్రభుత్వం బీసీ-ఈ తో కలిపి గిరిజన రిజ్వేషన్ బిల్లును కేంద్రానికి పంపడం ఒక మోసం అయితే కేంద్ర ప్రభుత్వం అదే సమస్యతో ముడిపెట్టడం రెండు ప్రభుత్వాలు ఆడుతున్న నాటకంలో భాగమేననే అనుమానాలు కలుగుతున్నాయి. బీసీ-ఈ లో రిజర్వేషన్ పెంపు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్ణయం. తెలంగాణ రాష్ట్రానికి దాంతో ఎటువంటి సంబంధం లేకున్నా కేంద్రం అదే సమస్యను బీజేపీ నాయకులు పదే పేదే మాట్లాడటం అవివేకం. కేంద్రం ప్రకటనతో గిరిజనుల పట్ల బీజేపీ పార్టీకున్న చిత్తశుద్ధి ఎలాంటిదో గిరిజన సమాజం అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అడగకుండానే అగ్రవర్ణ పేదలకు ఎకనామిక్ వీకర్ సెక్షన్ల (ఈడబ్ల్యూఎస్) పేరుతో ఆగమేఘాలపై 10 శాతానికి రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేసిన కేంద్ర ప్రభుత్వం గిజనుల విషయంలో ఎందుకు వివక్ష చూపుతుందో రాష్ట్ర బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి గిరిజన రిజర్వేషన్ పెంపు బిల్లును ఆమోదించి ప్రత్యేక తీర్మానం కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రెండు వర్గాల మధ్య తగాదా పెట్టే వైఖరి కాకుండా గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల ఆధారంగా 9.08 శాతానికి పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలన్నారు. లేకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.