- పైసా ఖర్చులేదు.. పెద్దగా చేసిందేమీ లేదు
- రోజు వారి కార్యక్రమాలకే పట్టణ ప్రగతి కలర్
- డివిజన్‌లలో పేరుకుపోయిన సమస్యలు
- ఇబ్బందులు పడుతున్న ప్రజలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 4వ విడత పట్టణ ప్రగతి గ్రేటర్ వరంగల్‌లో అభాసుపాలైంది. 15 రోజులపాటు పట్టణ ప్రగతి అంటూ ఊదర గొట్టిన బల్దియా పాలకులు, అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మారడంపై స్థానికులు దుమ్మెత్తి పోస్తున్నారు. శానిటేషన్ సిబ్బంది రోజూవారి నిర్వహించే పనులకే పట్టణ ప్రగతి అంటూ కలర్ ఇచ్చి ప్రజలను పక్కదోవ పట్టించారంటూ మండి పడుతున్నారు. చెత్తను తొలగించడం.. ప్రార్థనా మందిరాలు, రోడ్లను ఊడ్చడం.. కాలువలు శుభ్రం చేయడం.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను సీజ్ చేయడమే పట్టణ ప్రగతి అయితే వేలాదిగా ఉన్న బల్దియా సిబ్బంది మిగిలిన రోజుల్లో చేస్తున్న పనులేంటని ప్రశ్నిస్తున్నారు. పనీ, పాటా లేని సిబ్బందికే ప్రతి నెల కోట్ల రూపాయల జీతాలు చెల్లిస్తున్నారా అంటూ నిలదీస్తున్నారు.
-వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నాలుగో విడత పట్టణ ప్రగతితో వరంగల్ మహా నగరం మెరిసిపోతుందని..
రోడ్లు, కాలువలు బాగుపడుతాయని..డివిజన్లలో దోమల బాధ తప్పుతాయని..తాగునీటి పైప్ లైన్ల లీకేజీలు తొలగిపోతాయని..భగీరథ నీటి సమస్యలు తీరిపోతాయని..పాలకులు ప్రకటించినట్లు ప్రతి రోజూ తాగు నీరు అందుతుందంటూ ఆశ పడిన ప్రజలకు నిరాశే మిగిలింది.
ఈ నెల 3 నుంచి 18వ తేదీ వరకు ఉద్యమంలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ పి.ప్రావీణ్య, జిల్లా మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, బల్దియా పరిధిలోని శాసనసభ్యులు, నియోజకవర్గ సూపర్‌వైజర్లు, వార్డు ప్రత్యేక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న పట్టణ ప్రగతి ప్రజలకు నిరాశే మిగిల్చింది. పైసా ఖర్చు లేకుండా బల్దియా సిబ్బంది రోజువారీ నిర్వహించే పనులకే పట్టణ ప్రగతి అంటూ కలర్ పూసి 15 రోజులు ఊదరగొట్టడంపై పలువురు కార్పొరేటర్లు, స్థానికులు మండిపడుతున్నారు. నిత్యం తొలగించే చెత్తను ఐదారు రోజుల పాటు ఒక కుప్పగా పోసి దాని ముందు ఫొటోలు దిగి పట్టణ ప్రగతిలో భాగంగా చెత్తను తొలగించామంటూ ప్రకటించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలువలు ప్రతి రోజు శుభ్రం చేయాల్సిన బాధ్యత శానిటేషన్ సిబ్బందిపై ఉంది. కాలువల్లో పెరుగుతున్న మొక్కలను కూడా వారు తొలగించాల్సి ఉంటుంది. కాని ఈ పనులే చేసి అదేదో గొప్పగా చెప్పుకుంట ఫొటోలకు ఫోజులిచ్చిన నాయకులపై ప్రజలు మండి పడుతున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేదించి చాలా రోజులు గడుస్తున్నా దానిని అరికట్టలేని బల్దియా అధికారులను ఏమనాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిని కూడా గొప్పగా చెప్పుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారుల చేతకాని తనాన్ని ప్రశ్నించాల్సిన పాలకులు ఇవి కూడా గొప్పగా చేసినట్లు ప్రకటించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 422 ప్రజా మరుగుదొడ్లను శుభ్రం చేశామంటూ ప్రకటించడం సిగ్గు చేటంటున్నారు. ఫాగింగ్ స్ప్రే చేయడం బల్దియా సిబ్బంది పనికాదా అని ప్రశ్నిస్తున్నారు. ఎవరు చేసే పని వారు చేసినా దానిని ఏదో గొప్పగా సాధించామంటూ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఒక్క క్రీడా ప్రాంగణాల ఏర్పాటు మినహా పట్టణ ప్రగతి షెడ్యూల్‌లో కొత్తగా చేర్చింది ఏమీ లేకపోవడంతో పాత సీసాలో కొత్త సారా అన్న చందంగా పట్టణ ప్రగతి సాగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పేరుకుపోయిన సమస్యలు..
అసలే వర్షాకాలం..డివిజన్లలో ఎక్కడ పడితే అక్కడ మురుగు నీరు నిలువ ఉంటుంది. దీంతో దోమలు దండయాత్ర చెప్పలేని సమస్యగా మారింది. డివిజన్లలో ఫాగింగ్ చేసే దిక్కులేదు. మురుగు కాలువలు శుభ్రం చేసే సిబ్బంది లేదు. కాలువల్లో దోమల మందు పిచికారి చేసే వారే కరువయ్యారు. దోమల లార్వాలను అరికట్టే ఆయిల్ బాల్స్ ఊసేలేదు. దీంతో రానున్న రోజుల్లో నగరంలో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశముందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ప్రజా ప్రతినిధులు మాత్రం బల్దియాలో పాలనను గాలికి వదిలేశారన్న ఆరోపనలు వినిపిస్తున్నాయి. ఇవే కాకుండా ప్రతి డివిజన్‌లో వందల సమస్యలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తూతూ మంత్రంగా పూడిక తీత..
నగరంలో ఉన్న మొత్తం 35 ప్రధాన మురుగు కాలువల్లో 15 అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించిన మహా నగర పాలక సంస్థ పాలకులు వాటిలో సిల్ట్ తొలగించేందుకు రూ.90లక్షలతో టెండర్ ఖరారు చేశారు. తమకు అనగుణంగా ఉండే బడా కాంట్రాక్టర్‌కు ఈ పలనులను అప్పగించారు. అయితే పనులపై పర్యవేక్షణ లేకపోవడంతో తూతూ మంత్రంగా పూడిక తీసి మమా అనిపించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నారు. ప్రతి ఏడు అండర్ రైల్వే గేట్ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న బొందివాగు నాలా వైపు అధికారులు, పాలకులు కన్నెత్తి కూడా చూడక పోవడం వారి పనితనానికి అద్దం పడుతోంది. పూడిక తీత పనుల పేరిట పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు పర్సంటేజీల ప్రకారం పెద్ద మొత్తంలో పంచుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి.
సమస్యలకోసం ప్రత్యేక యాప్..
నగరంలోని 66డివిజన్లలో పేరుకు పోయిన సమస్యలను తెలుసుకునేందుకు ఒక్కో డివిజన్‌కు ఒక్కో అధికారిని ఇన్‌చార్జిని నియమించారు. వీరు స్థానిక కార్పొరేటర్‌తో కలిసి డివిజన్‌లో పర్యటించి ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యే యాప్‌లో ఎప్పటి కప్పుడు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం 66 డివిజన్లలో 6,219 ఫిర్యాదులు అందినట్లు బల్దియా అధికారులు ప్రకటించారు. వీటిలో చిన్న చిన్న సమస్యలను పరిష్కరించామని, అభివృద్ధికి సంబంధించిన సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామంటున్నారు.
నలుగురు నవ్విపోదురుగా..
పట్టణ ప్రగతిలో భాగంగా నగర పాలక సంస్థ చేపట్టిన పనులను బల్దియా పాలకులు అధికారికంగా ప్రకటించారు. వారు చేపట్టిన పనులను చూసి నగర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదా పట్టణ ప్రగతి అంటూ నవ్వుకుంటున్నారు. బల్దియా ఆధ్వర్యంలో నగరంలో గొప్పగా నిర్వహించిన పట్టణ ప్రగతి పనులు ఈ విధంగా ఉన్నాయి.
- పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా 6,403.72 టీపీడీ చెత్తను తొలగించడం జరిగింది. 484.66 మీటర్ల రోడ్డు వెంబడి ఉన్న పొదలను తొలగించారు.
- 645.86 కిలోమీటర్ల డ్రైన్ లలోని పూడికలు తొలగించారు.
- వరద నీటి కాలువలు, కల్వర్టులు, మురుగు కాలువల వద్ద 204 జాలీలను ఏర్పాటు చేశారు.
- 422 ప్రజా మరుగుదొడ్లను, 637 ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలను శుభ్రం చేయడం జరిగింది.
- 622 మతపరమైన ప్రదేశాలు, పార్కులను శుభ్రం
- 263 లోతట్టు ప్రాంతాలను పూడ్చడం జరిగింది
- 86 ఓహెచ్ ఎస్ ఆర్, జీఎల్ ఎస్ ఆర్, ఈ ఎల్ ఎస్ ఆర్ లను వాటి పరిసరాలను శుభ్రం చేశారు.
- 2,223 ప్రదేశాలలో ఫాగింగ్ స్ప్రే చేయడం జరిగింది.
- 146 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను సీజ్ చేసి 30,061 రూపాయల జరిమానా విధించడం జరిగింది.
- 188 పనిచేయని ఎండిపోయిన బోరు బావులను మూసివేసి 24 ఇంకుడు గుంతలను పునరుద్ధరించారు.
- 43 శిథిలావస్థలో ఉన్న ఇండ్ల తొలగింపు.
- పచ్చదనంలో భాగంగా 1,104 మొక్కల కలుపు తీయుట, సాసరింగ్ చెట్ల గార్డులు సరిచేసి మొక్కలు ఏర్పాటు.
- 115 కొత్త టీ పార్కుల కొరకు స్థలాలను గుర్తించి 3,315 గుంతలను త్రవ్వడం జరిగింది.
- 252 నీటి సరఫరా పైపులైన్ల లీకేజీల గుర్తించి సరి చేయడం జరిగింది.
- 125 పంప్ సెట్ల మరమ్మత్తులు
- 280 వంగిన స్తంభాలు సరి చేయుట, 109 తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాలను మార్చుట, 216.4 మీటర్ల వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరి చేశారు.
- 158 స్మశాన వాటికల శుభ్రం, 10 వైకుంఠధామం పనులు ప్రారంభం, రెండు వైకుంఠ ధామాలు సమకూర్చడం జరిగింది.
- 19 రైతు బజార్లు మార్కెట్లను శుభ్రం చేశారు
- 20 తెలంగాణకు క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడం జరిగింది.





