Warangalvoice

kothi_ellaiah

కోతి ఎల్లయ్య సేవలు విశిష్టమైనవి

  • అధ్యాపక వృత్తికి వన్నెతెచ్చిన వ్యక్తి
  • ఆయన జీవన విధానం ఆదర్శప్రాయం

వరంగల్ వాయిస్, హసన్ పర్తి : మూడు దశాబ్దాలు ఉత్తమ సేవలు అందించిన గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు కోతి ఎల్లయ అధ్యాపక వృత్తికి వన్నెతెచ్చాడని హసన్ పర్తి బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఇన్నంశెట్టి సుమాదేవి అన్నారు. ఆయన జీవన విధానం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వివిధ ప్రాంతాల్లో 30 ఏళ్లు పనిచేసి హసన్ పర్తి బాలికల హైస్కూల్లో ఉద్యోగ విరమణ పొందిన కోతి ఎల్లయ్యకు సోమవారం అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమాదేవి మాట్లాడుతూ సమయపాలన పాటించడంతో పాటు విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దడంలో ఆయన ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. స్థానిక కార్పొరేటర్ జి.శివకుమార్, చిన్ననాటి మిత్రుడు సీనియర్ జర్నలిస్ట్ గడ్డం కేశవమూర్తి మాట్లాడుతూ స్వయంకృషితో పైకి ఎదిగిన ఎల్లయ్య సేవలను కొనియాడారు. అన్నారం షరీఫ్ పెద్ద తండా, ఉర్సు, ఐనవోలు, హసన్ పర్తి పాఠశాలలో ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు. జీవితం అమూల్యమైనది. ఎవరికైనా ఒక్కసారే దొరుకుతుంది. ఆ జీవితాన్ని అందంగా మలుచుకోవాలి. అర్థవంతంగా గడపాలని పొడిశెట్టి శ్రీదేవి, గోపగాని రాజన్న, విజయలక్ష్మి, రామన్న, విజయ తదితరులు అన్నారు. ఈ అభినందన కార్యక్రమంలో సహచర ఉపాధ్యాయులు ఎల్లయ్య, స్వరూప రాణి దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. సన్మాన పత్రాలను చదివి వినిపించడమే కాక ఫొటో చిత్రపటాలను అందించారు. బంధుమిత్రులంతా ఘనంగా శాలువాలతో సత్కరించారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, చిన్ననాటి మిత్రులు బాచిపల్లి చొక్కారావు, కళ్యాణి, ముత్యాల కుమారస్వామి, పద్మ రాజన్, రజిత, అరుణ్ తేజ, శీలం పార్థసారధి, రాము, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో విద్యార్థుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ఉపాధ్యాయులు బ్యాండ్ మేళాతో వేదికపైకి కోతి ఎల్లయ్యను తీసుకువచ్చి పూలమాలలతో సత్కరించారు.

kothi ellaiah 3 kothi_ellaiah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *