Warangalvoice

కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి

  • రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్
వరంగల్ వాయిస్, కాజీపేట : కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక నిరుద్యోగ యువతీ యువకులతోపాటు భూములిచ్చిన అయోధ్యపురం గ్రామస్థులకు 65 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ రైల్వే డిమాండ్ చేసింది. బుధవారం అసోసియేషన్ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ డిమాండ్‌పై తెలంగాణ రైల్వే జేఏసీ, రాజకీయ జేఏసీ సాగిస్తున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
నియామకాల్లో ప్రత్యేక విధానం ఉండాలి..
నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణలో విభజన చట్టం ప్రకారం దక్కిన కోచ్ ఫ్యాక్టరీని కాజీపేటలో నిర్మించడం హర్షణీయమని అసోసియేషన్ పేర్కొంది. అయితే, ఇందులో నియామకాలను సాధారణ ఆర్ఆర్ బీ, ఆర్ఆర్ సీ పద్ధతిలో కాకుండా, ఈ ప్రాంత నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక జీవో ద్వారా చేపట్టాలని కోరారు. అభ్యర్థుల ఆధార్ కార్డులను ప్రామాణికంగా తీసుకుని, అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ ద్వారా స్థానికులకే ఉద్యోగాలు కేటాయించాలన్నారు.
అప్రెంటీస్ పూర్తి చేసిన వారికి..
రైల్వేలో ఆక్ట్ అప్రెంటిస్ పూర్తి చేసిన వారికి కూడా కొంత శాతం ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని వారు కోరారు. భూమిని త్యాగం చేసిన అయోధ్యపురం రైతులకు ధన్యవాదాలు తెలుపుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్మాణం స్థానికుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో జేఏసీ నిర్వహించే కార్యాచరణలో తాము కూడా భాగస్వాములై, నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కేవరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ రైల్వే అధ్యక్షులు పొక్కుల కృష్ణమూర్తి, కార్యదర్శి గుర్రపు సుధాకర్ రావు, కోశాధికారి పి.చంద్రమోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్నాల నగేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇ.సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్లు ఎం.దేవదాస్, కే.బాబురాజ్, వర్కింగ్ కమిటీ సభ్యులు పి.ప్రభాకర్, జి.నరసింహమూర్తి, జే.బాబురావు, వి.లుక్మాచారి, ఎండీ మొహీనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *