Warangalvoice

KTR guarantee .. Buttadakhalu

కేటీఆర్‌ హామీ .. బుట్టదాఖలు

  • రెండు సంవత్సరాలైనా నెరవేరని లక్ష్యం
  • పక్కదారి పట్టిన ప్రత్యేక నిధులు
  • ముంపుపై చొరవ చూపని బల్దియా
  • గత నిధులకే మోక్షం లేదు..
  • అదనంగా మరో రూ.250 కోట్ల నిధులంటూ ప్రచారం

‘‘వరంగల్‌ మహా నగరపాలక సంస్థ పరిధిలో ముంపు సమస్యే ఉండొద్దు.. అందుకు కావాల్సిన శాశ్వత ప్రణాళికలు రూపొందించండి.. ప్రధాన నాలాలను విస్తరించి ఇతరులెవరూ ఆక్రమించకుండా రెండు వైపుల గోడలు కట్టాలి.. ఆక్రమణకు గురైనా నాలాలను క్లియర్‌ చేయండి.. వాటితోనే అసలు సమస్య.. నాలాల ఆక్రమణదారులు ఏ హోదాలో ఉన్నా ఉదాసీనత ప్రదర్శించవద్దు.. అవసరమైతే పోలీసుల ప్రొటెక్షన్‌ తీసుకొని కూల్చివేయండి.. నగరాన్ని ముంపునుంచి రక్షించేందుకు ఎన్ని కోట్లు ఖర్చైనా ఫర్వాలేదు.. ’’అంటూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు అక్టోబర్‌ 2020లో ఇచ్చిన హామీని బల్దియా అధికారులు అటకెక్కించారు. మంత్రి హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా నేటికీ నగర ప్రజలు ముంపు భయంతో వణికిపోతున్నారు. ముంపు పనుల కోసం విడుదలైన నిధులకు పక్కదారి పట్టించారు. దీంతో నగరం మరోసారి ముంపునకు గురయ్యే ప్రమాదం పొంచిఉంది.
-వరంగల్‌ వాయిస్‌, వరంగల్‌ ప్రతినిధి

వరంగల్‌ వాయిస్‌, వరంగల్‌ ప్రతినిధి : 2020లో వరంగల్‌ మహా నగరపాలక సంస్థ పరిధిలోని నలభైకి పైగా కాలనీలను వర్షం నీరు ముంచెత్తింది. వారం రోజుల పాటు జన జీవనం స్థంభించింది. రాకపోకలు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాలకు వెళ్లే మార్గం లేక వందలాది మంది పునరావాస కేంద్రాలను ఆశ్రయించారు. దీంతో స్పందించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వరంగల్‌ నగరంలో పర్యటించారు. పడవల్లో వెళ్లి పలు ప్రాంత వాసులను కలుసుకుని వారి అవస్థలను తెలుసుకున్నారు. తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.2వేల నగదును అందించారు. అనంతరం జిల్లా, బల్దియా అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి మహా నగరంలో ముంపు సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని, అందుకు కావాల్సిన ప్రణాళికలు రూపొందించాలని బల్దియా అధికారులను ఆదేశించారు. ఎంత ఖర్చైనా ఫర్వాలేదు..ముంపు సమస్య తీరాలంటూ అధికారులకు హితబోధ చేశారు. మంత్రి హామీ మేరకు ముంపు ప్రత్యేక నిదుల పేరిట ప్రభుత్వం రూ.510 కోట్లు విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వీటితో రిటైనింగ్‌ వాల్స్‌, కల్వర్టులు, బ్రిడ్జిలు, స్ట్రామ్‌ వాటర్‌ డ్రైన్‌లను నిర్మించనున్నట్లు బల్దియా అధికారులు ప్రకటించారు. వీటితోపాటు ముంపునకు ప్రధాన కారణాలైన నగరంలోని వడ్డెపల్లి, భద్రకాళి, నయీంనగర్‌, బొందివాగు, శాఖరాశికుంట నాలాలను శుభ్రం చేయనున్నట్లు వెల్లడిరచారు. ఇందులో రూ.157 కోట్లతో చేపట్టిన పలు పనులు పూర్తయినట్లు, రూ.234కోట్లతో చేపట్టిన పలు పనులు పెండిరగ్‌లో ఉన్నట్లు బల్దియా అధికారులు ప్రకటిస్తున్నారు.

ఆరంభ శూరత్యం..
మంత్రి కేటీఆర్‌ ఆదేశాల అమలుకు బల్దియా యంత్రాంగం నడుం బిగించింది. ఆరంభ శూరత్యం అన్నట్లుగా హడావిడి చేశారు. పలు ప్రాంతాల్లో నాలాలకు అడ్డుగా ఉన్న పలు నిర్మాణాలను కూల్చి వేశారు. ఆ తర్వాత షరా మామూలే అన్నట్లుగా నాలా విస్తరణ పనులను అటకెక్కించారు. ముంపు పేరిట విడుదలైన నిధులను బల్దియా పాలక వర్గం పక్కదారి పట్టించింది. దీంతో తిరిగి యథాతథ స్థితి నెలకొంది. ఆ తర్వాత 2021లో కురిసిన వర్షాలకు కూడా నగరంలోని చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. 2022లోనూ తిరిగి ప్రజలకు ముంపు తిప్పలు తప్పేలా లేవు.

కానరాని హద్దులు..
నగరంలోని అన్ని ప్రధాన నాలాలకు హద్దులు ఏర్పాటు చేయాలంటూ స్వయాన రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఆదేశించినా బల్దియా అధికారులు, పాలకులు మాత్రం ఆ ఆదేశాలను మురుగునీటి గుంతలో కలిపారు. నగరంలోని ప్రధాన నాలాలకు కనీసం హద్దులే లేకపోవడంతో భూ మాఫియా రెచ్చిపోతోంది. చాలా ప్రాంతాల్లో నాలాలు ఆక్రమణకు గురై కనీస వెడల్పు కూడా లేకుండా పోయాయి. హద్దులు ఏర్పాటు చేయడంలో బల్దియా అధికారులు, పాలకులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముంపునకు కారణమైన ప్రధాన నాలాల్లో చాలా భాగం ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోనే ఉంది. దీంతో వరద నీరు ప్రవహించే మార్గం కానరాక పక్కనే ఉన్న కాలనీలను ముంచెత్తుతున్నాయి.

సహాయక చర్యలపైనే ప్రత్యేక దృష్టి..
నగరంలో ముంపు సమస్యే ఉండకూడదంటూ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన ఆదేశాలను పక్కన బెట్టి ముంపు సమస్య ఏర్పడితే చేపట్టాల్సిన సహాయక చర్యలపైనే గ్రేటర్‌ అధికారులు, పాలకవర్గం దృష్టి పెట్టింది. దానికోసం ప్రత్యేక టోల్‌ ఫ్రీ నెంబర్‌ను పెట్టి విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. మహా నగరంలో వర్షం పడితే 18 నీరు నిల్వ ప్రాంతాలతోపాటు ముంపు గురయ్యే 40 కాలనీల్లో నాలుగు డీఆర్‌ ఎఫ్‌ బృందాలతో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి డివిజన్‌కు ఒక ఏఈ స్థాయి అధికారిని నియమించి రూ.5 లక్షల వరకు తక్షణ ఖర్చుకు కేటాయించాలని నిర్ణయించారు.

అదనంగా మరో రూ.250కోట్లు..
నగరంలో రెండు సంవత్సరాల క్రితం మంత్రి కేటీఆర్‌ మంజూరు చేసిన నిధులతో చేపట్టాల్సిన పనులనే బల్దియా సిబ్బంది నేటికీ పూర్తి చేయలేక చేతులెత్తేసింది. రెండేళ్లుగా ఒక్క పని కూడా పూర్తి కాలేదు. ఇప్పటికీ చాలా పనులు సా..గుతూనే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా అడిగే దిక్కు లేకుండా పోయింది. ఇది చాలదన్నట్లు నగరంలోని ముంపును తొలగించేందుకు మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి అదనంగా మరో రూ.250కోట్లు మంజూరు చేయిస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు హామీ ఇచ్చారు.

చివరి నిమిషంలో హడావిడి..
రెండు సంవత్సరాలుగా ముంపు సమస్యలపై శ్రద్ధ చూపని బల్దియా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. ఒకవైపు వర్షాలు ముంచుకొస్తుంటే పనుల పేరిట హంగామా చేస్తున్నారు. సమీక్షలు, పర్యటనలతో హడలెత్తిస్తున్నారు. కాగా హడావిడిగా పనులు ముగించడం ద్వారా ప్రజా ధనం దుర్వినియోగం అవుతుంది తప్ప పెద్దగా ఉపయోగం ఉండదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరి నిమిషంలో చేపట్టే పనుల్లో సొంత ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *