Warangalvoice

Costly bike will be robbed if seen..: Warangal CP Dr. Tharun Jyoshi

కాస్ట్ లీ బైక్ కనబడితే దోచేస్తారు..

  • ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్
  • రూ.13లక్షల విలువ చేసే బైక్ ల స్వాధీనం
  • వివరాలు వెల్లడించిన తరుణ్ జోషి

వరంగల్ వాయిస్, క్రైం: అత్యంత ఖరీదైన ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగలను శనివారం హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు 13 లక్షల విలువ గల ఎనిమిది ఖరీదైన ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు.. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ప్రాంతానికి చెందిన షిండే జితేందర్, షిండే అశోక్ తో పాటు హనుమకొండ జిల్లా పద్మాక్షీ ప్రాంతానికి చెందిన షిండే ఈశ్వర్ ముగ్గురు వరుసకు అన్నాదమ్ములు కావడంతో వీరు తరుచుగా కలుసుకునేవారు. ఇదే సమయంలో నిందితులు ముగ్గురు కలిసి మద్యం తాగడంతో పాటు జల్సాలు చేసేవారు. దీంతో వీరు చేసే చిన్న చిన్న పనుల కారణంగా వీరికి వచ్చే అదాయం వీరి జల్సాలకు సరిపోకపోవడంతో, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో నిందితుల్లో ఒకడైన జితేందర్ ద్విచక్ర బైక్ మెకానిక్ కావడంతో ఇతని సూచన మేరకు ఖరీదైన ద్విచక్ర వాహనాల చోరీ చేసి వాటిని విక్రయించి వచ్చిన డబ్బుతో జల్సాలు చేయాలకున్నారు. ఇందులో భాగంగా నిందితులు మొత్తం ఎనిమిది చోరీలకు పాల్పడ్డారు. ఇందులో హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు వాహనాల చోరీలకు పాల్పడగా, పటాన్ చేరువు ప్రాంతంలో నాలుగు వాహనాలు, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ఒక వాహనాన్ని నిందితులు చోరీ చేశారు. చోరీ చేసిన వాహనాలను నిందితుల్లో ఒకడైన హనుమకొండ నివాసి ఈశ్వర్ ఇంటి వద్ద భద్రపర్చేవారు. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ద్విచక్ర వాహన చోరీలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్ సూచన మేరకు హనుమకొండ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని పోలీసులు నిందితులను గుర్తించి వారి కదలికలపై నిఘా పెట్టారు.
నిందితులు చోరీ చేసిన వాహనాలను హనుమకొండ ప్రాంతంలో విక్రయించేందుకుగాను నిందితులు ఈశ్వర్ ఇంటిలో వున్నట్లుగా హనుమకొండ పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు, నిందితుడు ఈశ్వర్ లో భద్రపర్చిన ఎనిమిది ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహన దొంగలను పట్టుకోవడంతో పాటు చోరీకి గురైన వాహనాలను స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్, హనుమకొండ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ జీ, ఎస్.ఐ రాజు, కానిస్టేబుళ్లు శివకృష్ణ, గౌస్ పాషా, శ్రీకాంత్, భాస్కర్, హోంగార్డ్ రవిలను పోలీస్ కమిషనర్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *