- Congress MLA | కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్నవారికి సరైన ప్రాధాన్యం ఇవ్వడంలేదని అన్నారు. నిన్నమొన్న పార్టీలో చేరినవాళ్లకు పదవులు కట్టబెట్టి అందలం ఎక్కించడం ఏమాత్రం సబబుకాదని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్నవారికి సరైన ప్రాధాన్యం ఇవ్వడంలేదని అన్నారు. నిన్నమొన్న పార్టీలో చేరినవాళ్లకు పదవులు కట్టబెట్టి అందలం ఎక్కించడం ఏమాత్రం సబబుకాదని వ్యాఖ్యానించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఈ విధంగా పార్టీ తీరుపై అసంతృప్తి గళం వినిపించారు.
తెలంగాణ మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న జిల్లా రంగారెడ్డి జిల్లానేనని, అలాంటి జిల్లాకు అన్యాయం చేయొద్దని అన్నారు. గతంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కనీసం ఆరుగురు మంత్రులు ఉండేవాళ్లని, ఇప్పుడు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు.
ఒకవేళ సామాజిక సమీకరణలు అడ్డువస్తున్నాయంటే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రంగారెడ్డి చెప్పారు. జిల్లా అభివృద్ధి కోసం రాజీనామా చేసి వేరే సామాజిక వర్గం అభ్యర్థిని గెలిపించడానికి తాను రెడీగా ఉన్నానని అన్నారు. రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునైనా గ్రేటర్ పరిధిలోని నేతలకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్లకు గౌరవం ఇవ్వాలేగానీ, వెంటనే పదవులు ఇవ్వొద్దని సూచించారు.
పార్టీ కోసం ఆది నుంచి పనిచేసిన వాళ్లను పక్కన పెడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. కనీసం పదేళ్లు కష్టపడిన వారికి పదవులు ఇవ్వాలని సూచించారు. పార్టీ లైన్ దాటకూడదు కాబట్టి ఇంతకంటే ఇంకా ఎక్కువ మాట్లాడలేక పోతున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
