- బండి అరెస్ట్పై ఆగ్రహించిన తరుణ్ చుగ్
వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని, ఇక ఆయనను సాగనంపడమే తరువాయి అని బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అరెస్ట్ తీరును తప్పుపట్టారు. బండి సంజయ్‌ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అరెస్టుకు కారణాన్ని వెల్లడిరచడంలో తెలంగాణ పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఇష్యూను బీజేపీ ప్రశ్నిస్తున్నందుకే తమ నాయకులను అరెస్టు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు భయపడే… ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ అహంకారానికి బండి సంజయ్ అరెస్ట్ ఒక నిదర్శనం అని తరుణ్ చుగ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు భయపడేది లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబం అవినీతి పాలనపై బీజేపీ పోరాడుతూనే ఉంటుందన్నారు. పరిపాలన తీరును ప్రశ్నిస్తే జైల్లో వేస్తామంటే.. బీజేపీ నాయకులెవరూ భయపడరని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో బీజేపీ కార్యకర్తలెవరూ భయపడవద్దని తరుణ్ చుగ్ భరోసా ఇచ్చారు.
