Warangalvoice

If you work hard, the job is yours

కష్టపడితే కొలువు నీదే

  • అంబేద్కర్‌ భవన్‌ లో గ్రూప్‌-1 అభ్యర్థులకు అవగాహన సదస్సు
  • కృషి, పట్టుదల తోడైతే గ్రూప్‌ -1 నీ సొంతం
  • బేసిక్స్‌ పై పట్టు పెంచుకోవాలి..
  • ఏకాగ్రతతో చదవి.. పునశ్చరణ చేసుకోవాలి
  • సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి..
  • రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.పార్థసారథి

‘‘ఒక సంవత్సరం పాటు పట్టు సడలకుండా చదివితే.. భవిష్యత్‌ బంగారుమయం అవుతుంది.. గ్రూప్‌-1 లాంటి ఉన్నతోద్యోగం సాధిస్తే మీ జీవితమే మారిపోతుంది.. అందుకే ప్రిపరేషన్‌ లో ఉన్నప్పుడు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి. బేసిక్స్‌, కాన్సెప్ట్‌ పై పట్టు సాధించడంతో పాటు ఎక్కువ సార్లు పునశ్చరణ చేయాలి. గ్రూప్‌-1లో భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఉండడం సువర్ణావకాశం.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి’’ అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.పార్థసారథి ఉద్యోగార్థులకు సూచించారు. మంగళవారం హనుమకొండ అంబేద్కర్‌ భవన్‌ లో గ్రూప్‌-1 అభ్యర్థులకు పరీక్షపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి చీఫ్‌ గెస్ట్‌ గా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.పార్థసారథి హాజరై పలు సూచనలు, సలహాలు అందించి వారిలో స్ఫూర్తిని నింపారు. పరీక్షలకు సన్నద్ధతపై తన అనుభవాలతో విడమరిచి చెబుతూ అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందింపజేశారు.
-వరంగల్‌ వాయిస్‌, హనుమకొండ

వరంగల్‌ వాయిస్‌, హనుమకొండ: పక్కా ప్రణాళికతో కష్టపడి చదివితే కోరుకున్న ప్రభుత్వ కొలువు మీ సొంతం అవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సి.పార్థసారథి సూచించారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ భవన్‌ లో గ్రూప్‌ -1 పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతీ, యువకులకు ఫ్రీ కోచింగ్‌ అందిస్తున్న నేపథ్యంలో మంగళవారం ఆయన హనుమకొండ, వరంగల్‌ జిల్లా కలెక్టర్లతో కలిసి ఉద్యోగార్థులకు మార్గదర్శనం చేశారు. వేదిక పై నుంచి పార్థసారథి దిగి అభ్యర్థుల మధ్యకు వచ్చి తనదైన శైలిలో కీలక సూచనలు చేస్తూ వారిలో స్ఫూర్తిని పెంపొందింపజేశారు. ఉద్యోగ సాధనకు పాటించాల్సిన పద్ధతులు, సన్నద్ధత తీరు గురించి అన్ని అంశాలను మేళవిస్తూ, ఎంతో అర్థవంతంగా ఆకట్టుకునే రీతిలో విడమర్చి చెప్పడం అభ్యర్థుల్లో ఆత్మస్థైర్యాన్ని ఇనుమడిరపజేసింది. ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో తెలుగు మాధ్యమంలోనే తాను చదువుకుని కోరుకున్న సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగాన్ని సాధించానంటూ తన స్వీయానుభవాన్ని అభ్యర్థుల ముందు ఉంచుతూ వారిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. నిరాశ, నిస్పృహలను దరిచేరనివ్వకుండా, తాము ఎలాగైనా సాధిస్తానని గట్టి సంకల్పంతో కష్టపడితే ఆశించిన లక్ష్యం దానంతట అదే వరిస్తుందని సూచించారు. మొహమాటం, బద్ధకం, వాయిదా వేయడం వంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ, మానసిక ఒత్తిడిని జయిస్తూ ముందుకు సాగాలని హితవు పలికారు.
ప్రస్తుతం ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో యువత కోరుకున్న కొలువులు దక్కించుకుని బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయడంతో అనవసర అపోహలకు ఆస్కారం లేకుండా పోయిందన్నారు. ఇదివరకటితో పోలిస్తే అభ్యర్థులకు అనేక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని జిల్లాకు అత్యధిక కొలువులు దక్కేలా కృషి చేయాలని సూచించారు. ఫ్రీ కోచింగ్‌ తో ఇప్పటికే యాభై శాతం విజయం సాధించగలిగారని, ఇంకాస్త గట్టిగా కష్టపడితే జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వ అధికారి హోదాను అనుభవిస్తూ ప్రజలకు సేవ చేస్తూ ఆత్మ సంతృప్తిని పొందే అవకాశం కేవలం ప్రభుత్వ ఉద్యోగం ద్వారానే లభిస్తుందన్నారు. పోటీ పరీక్షలకు సంబంధించి పరీక్షా విధానంలో, సిలబస్‌ లో పెద్దగా తేడా ఉండదని, విషయం పరిజ్ఞానం, అవగాహన ముఖ్యమని సూచించారు. ఎన్ని గంటల పాటు చదివామని కాకుండా, ఎంత ఏకాగ్రతతో చదివాం.. చదివిన అంశాలను పరీక్షలో ఎలా రాశాం.. అన్నదే అభ్యర్థుల విజయావకాశాలను నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో శక్తి సామర్థ్యాలు నెలకొని ఉంటాయని, తమపై తాము గట్టి నమ్మకంతో కష్టపడే వారే విజేతలు అవుతారని అన్నారు. నేర్చుకుంటున్న అంశాలను ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేసుకుంటూ, ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవాలని సూచించారు. పోటీ పరీక్షల సన్నద్ధత వన్‌ డే మ్యాచ్‌ కాదని, దీనిని టెస్ట్‌ మ్యాచ్‌ గా భావిస్తూ, నిలకడ, ఏకాగ్రతతో లక్ష్యాన్ని ఛేదించాలని పేర్కొన్నారు. మన చేతుల్లో లేని విషయాల గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేయడం కంటే, మనం చేయాల్సిన కర్తవ్యాన్ని పూర్తి స్థాయిలో నిర్వర్తించడం పైనే దృష్టిని కేంద్రీకరించాలని హితబోధ చేశారు. ప్రభుత్వం స్థానికులకు 95 శాతం ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉద్యోగానికి 21 నుంచి 49 సంవత్సరాల వరకు అవకాశాన్ని కల్పించడం గొప్ప నిర్ణయమన్నారు. పోటీ పరీక్షల్లో రాణించలాంటే ప్రతి సబ్జెక్టును క్షుణ్ణంగా చదివి ప్రణాళిక బద్ధంగా పోటీ పడాలన్నారు. సరైన లక్ష్యంతో చదివితే ఏ కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లకున్నా ఇంట్లో ఉండే విజయం సాధించవచ్చన్నారు. ఇంత మంచి అవకాశం మళ్లీ రాదని, విద్యార్థులు ఇది గుర్తించి పోటీ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌ గాంధీ హనుమంతు, డా.గోపి, అడిషనల్‌ డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌, డీఆర్డీవో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ కుమార్‌, డీపీవో వి.జగదిశ్వర్‌, మైనార్టీ సంక్షేమ అధికారి శ్రీను మేన, సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణి నిర్మల, గ్రూప్‌ వన్‌ రాసే అభ్యర్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *