- కల్యాణ వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవి
వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : వరంగల్ జిల్లా ప్రజలకు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలు ఆలయాలలో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సవాల్లో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మాట్లాడుతూ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం వేలాది మంది భక్తులు రాములవారి కళ్యాణానికి చూడటానికి పోటెత్తారని, అయోధ్యలోని రామాలయంలో 500 సంవత్సరాల తరువాత ఘనంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయనన్నారు. రాముడు ధర్మ స్వరూపుడు.. సత్యనిష్ఠకూ ధర్మనిరతికీ ప్రతీక అన్నారు. శ్రీరామ జయం.. సకల ప్రజల విజయం..అందుకే అన్ని కాలాల్లోనూ ఆదర్శం రామరాజ్యం. ధర్మం పక్షాన నిలబడి, ప్రజలను మరింత బలసంపన్నులను చేయాలని శ్రీ రామచంద్ర ప్రభువును వేడుకుందామని అన్నారు.
శంకరమఠంలో..
వరంగల్ నగరంలోని శ్రీశృంగేరి శంకరమటంలో బుధవారం శ్రీసీతారాముల కల్యాణం కమనీయంగా జరిగింది. ప్రధాన అర్చకులు సంగమేశ్వర జ్యోషి పర్యవేక్షణలో శృంగేరి సంప్రదాయ పద్ధతుల్లో అర్చకులు సోమశేఖర శర్మ ఉదయం 10.30 గంటల నుంచి షోడోపచార విశేష పూజతో సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. మధ్యానం 12.45గంటలకు అభిజిత్ లగ్నంలో వదువరులు సీతమ్మ, రామయ్యల తలపై జీలకర్ర బెల్లం పెట్టారు. అష్టోత్తర మహమంగలహారతి అనంతరం మహా అన్నదానం జరిగింది. శ్రీ శంకరసేవసమితి సభ్యులు రామారావు, భాస్కర్, కొమురయ్య, రాజేష్, రాజేంద్రప్రసాద్, సంధ్యా రాణి, కల్యాణి తదితరులు సుమారు 800 మంది భక్తులకు సేవలు అందించారు. ప్రణవి తదితర చిన్నారులు ఆలపించిన సీతారాముల కల్యాణ కీర్తనలు భక్తులను అలరించాయి. కార్పొరేటర్ వద్ది రాజు గణేష్, డాక్టర్ పోలనట్ రాజు, డాక్టర్ పీవీకే శాస్త్రి దంపతులు స్వామిని దర్శనం చేసుకున్నారు.
సాయిబాబా మందిరంలో..
శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం హనుమకొండ సాయిబాబా మందిరంలో బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పురోహితులు రాంబాబు శర్మ, కిషోర్ శర్మ మణిశర్మలు వేద మంత్రోత్సాహాల నడుమ , ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణం నిర్వహించారు.. మందిర చైర్మన్ మతుకుమల్లి హరి గోపాల్, ధర్మకర్తలు రాకం సదానందం, పూస సురేష్ కుమార్, నిమ్మల శ్రీనివాస్, వెయ్యిగండ్ల రమేష్ , మందిర వైద్యులు ఆకుల వెంకటరమణయ్య తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. కళ్యాణం అనంతరం భక్తులకు వడపప్పు ప్రసాదం తో పాటు బెల్లం పానకాన్ని అందించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు… రాత్రి జరిగిన చందనోత్సవ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.