- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి
వరంగల్ వాయిస్, జఫర్ గడ్ : కమ్యూనిస్టులే దేశానికి సరైన ప్రత్యామ్నాయం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. గురువారం జఫర్ గడ్ మండల కేంద్రంలో జనగామ జిల్లా పార్టీ రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ శిక్షణా తరగతులలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు, మండల కార్యదర్శులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన శిక్షణా తరగతుల ప్రారంభ సమావేశానికి సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆది సాయన్న అధ్యక్షత వహించగా తక్కళ్లపల్లి శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వామపక్షాల బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. కులం, మతం పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూసే పార్టీలకు కాలం చెల్లిందన్నారు. లౌకిక దేశమైన భారత దేశంలో మత రాజకీయాలు, మతోన్మాద శక్తులు అంతరించిపోక తప్పదని అన్నారు. కేంద్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు మేలు చేకూర్చేందుకే పని చేసిందని, పేదలు, మధ్య తరగతి వర్గాల ప్రజల సమస్యలను పట్టించుకోలేదన్నారు. దళితుల, గిరిజనుల, మైనారిటీలపై బీజేపీ హయాంలో దాడులు పెరిగాయని, చివరకు రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థలను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారన్నారు. కమ్యూనిస్టులు, లౌకిక శక్తులతోనే ప్రజాస్వామ్య, రాజ్యాంగ రక్షణ సాధ్యం, గడిచిన లోక్ సభ ఎన్నికలలో దేశ ప్రజలు బీజేపీకి సరైన గుణపాఠం చెప్పబోతున్నారని అన్నారు. రానున్న రోజులలో పార్టీ బలోపేతానికి సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జనగాం జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి, డాక్టర్ మార్క శంకర్ నారాయణ, పాతూరి సుగుణమ్మ, ఆకుల శ్రీనివాస్, మంగళంపల్లి జనార్ధన్, మండల కార్యదర్శి జువారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
