Warangalvoice

Educational blossom in the agency

 ఏజెన్సీలో విద్యా కుసుమం

  • ఎంబీబీఎస్‌ పట్టా స్వీకరించిన సాయిని స్వప్నిల్‌
  • జన్మనిచ్చిన గడ్డకు సేవ చేయడమే లక్ష్యమని వెల్లడి

వరంగల్‌ వాయిస్‌, ములుగు: ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టి మెడిసిన్‌ సాధించి, విజయవంతంగా పూర్తిచేశాడు సరస్వతీ పుత్రుడు సాయిని స్వప్నిల్‌. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకారాజుపల్లి గ్రామం సాయిని నరేందర్‌, రోజారమణి ఏకైక పుత్రుడైన సాయిని స్వప్నిల్‌ 2016 ఎంసెట్‌ లో మంచి ర్యాంకు సాధించి తెలంగాణ ఏర్పడ్డాక మొదటి మహబూబ్‌ నగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎం.బి.బి.ఎస్‌ సీటు పొందాడు. ఆరు సంవత్సరాల తన కోర్సు పూర్తిచేసుకుని మంగళవారం మహబూబ్‌ నగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన స్నాతకోత్సవంలో సాంస్కృతిక, క్రీడలు, యువజన, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చేతుల మీదుగా పట్టా స్వీకరించాడు. ఈ సందర్భంగా స్వప్నిల్‌ మాట్లాడుతూ.. చిన్న వయసు నుంచే చదువులో చురుకుగా ఉండే వాడినని, కలెక్టర్‌ కావాలనే ఆకాంక్షను తండ్రి కోరిక మేరకు వద్దనుకొని పేద ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో వైద్య విద్యలో చేరినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమాలు తన ఇంటర్‌ విద్యపై చాలా ఒత్తిడి పెంచాయని, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రం విడిపోవడం, కేంద్రం నీట్‌ ప్రవేశపెట్టాలనే ప్రయత్నం వల్ల ఎ.పి. ఎంసెట్‌ తో పాటు తెలంగాణ ఎంసెట్‌ రాశానని, మంచి ర్యాంకు సాధించిన తనకు వరంగల్‌ లోని కాకతీయ వైద్య కళాశాలలో సీటు వచ్చిందని తెలిపారు. అయితే అప్పటి ఎంసెట్‌ పేపర్‌ లీకు కావడంతో తెలంగాణ ఎంసెట్‌ రద్దు చేసి తిరిగి ఎంసెట్‌ నిర్వహించారని, మూడోసారి కూడా మంచి ర్యాంకు సాధించి వైద్య విద్యలో చేరానని చెప్పారు. ఉత్తర తెలంగాణలో మారుమూల ప్రాంతానికి చెందిన తనకు హైదరాబాద్‌ లోని ప్రముఖ ప్రైవేట్‌ వైద్య కళాశాలలో ఫ్రీగా సీటు వచ్చే అవకాశాన్ని వొదలుకొని పేద ప్రజలు ఎక్కువగా వచ్చే ప్రభుత్వ కళాశాలలో వైద్య విద్యను పూర్తి చేశానని తెలిపారు. ప్రైవేట్‌ వైద్యం, కార్పొరేట్‌ వైద్యం జడలు విప్పి దోపిడీ కొనసాగిస్తున్న నేటి తరుణంలో తల్లిదండ్రుల ప్రోద్బలంతో, గురువుల స్ఫూర్తితో తన శక్తికి మించి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తానని ప్రత్యేకించి వైద్య సేవలు అరకొరగా అందే తమ ఏజెన్సీ ప్రాంతానికి వైద్య సేవలు అందిస్తానని చెప్పారు. వైద్య విద్యలో రాణించి పేద ప్రజలకు సేవ చేయడానికి సిద్ధమైన సాయిని స్వప్నిల్‌ కు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, స్నేహితులతో పాటు ప్రజా సంఘాల నాయకులు డాక్టర్‌ జిలుకర శ్రీనివాస్‌, సోమ రామమూర్తి, డాక్టర్‌ చెరుకు సుధాకర్‌, ప్రొ. కూరుపాటి వెంకటనారాయణ, డాక్టర్‌ లక్ష్మి ప్రసాద్‌, డాక్టర్‌ వరప్రసాద్‌, తాడిశెట్టి క్రాంతి, ఊకంటి మహేందర్‌, సోమిడి అంజన్‌ రావు, చింతకింది కుమారస్వామి, అగ్గి రవి, దామెర వెంకటరమణ, మచ్చ దేవేందర్‌, రాదండి దేవేందర్‌, న్యాయవాదులు గుడిమల్ల రవికుమార్‌, బండి మొగిలి, రంగోజు భిక్షపతి, నీలంజన్‌ రావు, రంపీస రాజబాబు, నరోత్తం రెడ్డి, చింతం దనుంజయ్‌, చింత నిఖిల్‌ కుమార్‌, జెట్టి స్వామి, రాచకొండ ప్రవీణ్‌ కుమార్‌, రఫీక్‌, నీలం ప్రశాంత్‌, కిరణ్‌, రజనీకాంత్‌, రాజేంద్ర ప్రసాద్‌, గాంధీ తదితరులు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *