Warangalvoice

Rescue Operation Continuing At Slbc Tunnel Nagarkurnool

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు.. చిక్కుకున్న కార్మికులు వీళ్లే!

వరంగల్ వాయిస్, నాగర్ కర్నూలు: నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎడమ వైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద పై కప్పు కూలడంతో అందులో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే సొరంగంలో చిక్కుకున్న కార్మికుల వివరాలను ప్రకటించింది. సొరంగంలో జర్విసింగ్‌ (పంజాబ్‌), సన్నీసింగ్‌ (జమ్ముకశ్మీర్‌), మనోజ్‌ దోబే (యూపీ), శ్రీనివాసులు, సందీప్‌, సంతోష్‌ జట్కా ఇరాన్‌ చిక్కుకున్నట్లుగా తెలిపింది. వారి ఆచూకీ కోసం సహాయక సిబ్బంది వెతుకుతున్నారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన పలువురు కార్మికులను ఈగలపెంట జెన్‌కో ఆస్పత్రికి తరలించారు.

శనివారం ఉదయం ఎడవైపు సొరంగం 14వ కిలోమీటర్‌ వద్ద ప్రమాదం జరిగింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట సమీపంలో పనులు జరుగుతుండగా టన్నెల్‌ పైకప్పు 3 మీటర్ల మేర పడిపోయింది. దీంతో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రక్షించిన తోటి కార్మికులు హుటాహుటిన జెన్‌కో హాస్పిటల్‌కు తరలించారు.

ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విషయం తెలుసుకున్న మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఘటనా స్థలికి బయల్దేరారు. వారివెంట నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్‌, అధికారులు ఉన్నారు.

నల్లగొండ జిల్లాకు సాగు, తాగు నీరు అందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) సొరంగం ప్రాజెక్టును రూపొందించారు. 2005లో అప్పటి ప్రభుత్వం ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. 60 నెలల్లో పనులు పూర్తి చేయాలని నిర్ధేశించారు. శ్రీశైలం నుంచి నల్లగొండ జిల్లాకు 30 టీఎంసీల కృష్ణా జలాలను తరలించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అయితే టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌తో సొరంగం తవ్వకం చేపట్టగా సాంకేతిక సమస్యలు, వరద సమస్యలతో పనులు ఆగుతూ సాగుతున్నాయి. కాగా, మొత్తం ఇన్‌ లెట్‌, అవుట్‌ లెట్‌ సొరంగాలు కలిపి 44 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా.. 9.559 కిలోమీటర్ల తవ్వకం పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఇప్పటికే ప్రభుత్వం ఆరుసార్లు పనుల గడువు పొడించింది. తాజాగా 2026 జూన్‌ వరకు పనులు పూర్తిచేయాలని నిర్ధేశించారు. ప్రాజెక్టు అంచనాలను రూ.4,637 కోట్లకు పెంచారు. ఇప్పటిదాకా రూ.2646 కోట్లు ఖర్చుచేశారు. నల్లగొండలోని ఉదయ సముద్రం ప్రాజెక్టు కూడా ఈ ప్రాజెక్టులో అంతర్భాగం. కాగా, సొరంగం పనులు పూర్తి చేస్తే జిల్లాలో 3.41 లక్షల ఎకరాలకు సాగునీరు, 200 గ్రామాలకు తాగునీరు అందనుంది.

Rescue Operation Continuing At Slbc Tunnel Nagarkurnool
Rescue Operation Continuing At Slbc Tunnel Nagarkurnool

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *