Warangalvoice

Reddish Kadavendi

ఎరుపెక్కిన కడవెండి

  • ఘనంగా దొడ్డి కొమురయ్య
  • 76వ వర్ధంతి
  • దొడ్డి కొమరయ్య స్ఫూర్తిని
  • ఆదర్శంగా తీసుకోవాలి
  • నివాళులర్పించిన సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ

వరంగల్‌ వాయిస్‌, దేవరుప్పుల : చరిత్రాత్మక తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ కొనియాడారు. సోమవారం దేవరుప్పుల మండలంలోని కడవెండి గ్రామంలో దొడ్డి కొమరయ్య 76వ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని అమరుల అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి సీపీఐ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి దొడ్డి కొమురయ్య స్థూపానికి సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం దొడ్డి కొమురయ్య స్మారక భవనంలో ఏర్పాటు భవనంలో మండల కార్యదర్శి జీడీ ఎల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా కె.నారాయణ పాల్గొని మాట్లాడుతూ.. నిజాం సర్కారు హయాంలో విస్నూర్‌ కేంద్రంగా దేశ్‌ముఖ్‌ రాంచంద్రారెడ్డి అరవ్కె గ్రామాలపై ఆధిపత్యం నడుస్తుండగా ఆయన తల్లి జానకమ్మ దొరసాని కడవెండి కేంద్రంగా దేవరుప్పుల మండలంలో దేశ్‌ముఖ్‌ ప్రజల మానప్రాణాలతో ఆకృత్యాలకు చెలగాటం ఆడిరదన్నారు. ఈ క్రమంలో దొడ్డి కొమరయ్య వారి వికృత చేష్టలకు ఎదురొడ్డి నిలిచి తొలి అమరుడు అయ్యాడన్నారు. దొడ్డి కొమురయ్య ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కోరారు. దొడ్డి కొమురయ్య సతీమణికి కూడా నారాయణ ఘన నివాళులర్పించారు. ఎందరో మహనీయుల అమరత్వం స్ఫూర్తి తో ఏర్పడ్డ తెలంగాణలో ప్రస్తుతం రాచరిక పాలన నడుస్తోందని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం పేదల కోసం ప్రశ్నించే పౌరహక్కుల నేతల పై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టి విస్తృత చేష్టలకు పాల్పడుతోందన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎనిమిది సంవత్సరాల్లో దోపిడీదారులకు కొమ్ముకాస్తుందని, ప్రజల కోసం పోరాడే వారిపై కేసులు పెట్టి బేడీలు వేసి జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తానన్న ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా 28 మంది పన్ను ఎగవేత దారుల్లో 27 మంది ప్రధాని మోడీ స్వరాష్ట్ర గుజరాత్‌ కు చెందిన వారేనని అన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు పగటిపూట గుద్దుకోవడం రాత్రిపూట కలుసుకుంటారని, వారిద్దరూ ఒక్కటేనని అన్నారు. వరంగల్‌ లో పేదవారు సెంటు భూమి కోసం గుడిసెలు వేసుకుంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ మాఫియా దొంగలతో చేయికలిపి వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఐ జనగామ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ రాజారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తమ్మెర విశ్వేశ్వర్‌ రావు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆది సాయన్న, సుగుణమ్మ, ఏఐటీయూసీ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాస్‌, సీపీఐ జిల్లా కార్య వర్గసభ్యులు చొప్పరి సోమయ్య, రైతు సంఘం జిల్లా నాయకులు బిల్లా తిరుపతి రెడ్డి, పెద్ది యాదగిరిగౌడ్‌, బెజుగం ఎల్లయ్య, ఎడ్ల సోమనారాయణ, భాషపాక సోమన్న, సీపీఐ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *