- తగ్గని వాన జోరు..
- ఎటూ చూసిన నీళ్ల హోరు
- ఇండ్లలోకి వరద నీరు
- లోతట్టు ప్రాంతాలు జలమయం,
- కొట్టుకపోయిన రోడ్లు
- భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అటవీ గ్రామాల జలదిగ్బంధం
- గోదావరి ఉధృతిని పరిశీలించిన మంత్రి సత్యవతి రాథోడ్
వాన జోరు తగ్గడం లేదు.. వరద హోరు ఆగడం లేదు.. చెరువులు మత్తళ్లు దుముకుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి పరవళ్లు తొక్కుతోంది. వరంగల్ మహా నగరంతో పాటు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో కాలనీలు జలమయమయ్యాయి. పలు అటవీ గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. వరద ఉధృతితో రోడ్లు తెగిపోయాయి.. పలు గ్రామాల్లో ఇండ్లు కూలిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలిస్తూ.. అవసరమైతే తప్పా బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు.
-వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి
వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎటూ చూసినా నీళ్లే కనపడుతున్నాయి. చెరువులు అలుగు పోస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. కాగా, వరంగల్ నగరంలో పలు కాలనీలు జలమయమయ్యాయి. హంటర్ రోడ్ రైల్వే ట్రాక్ వద్ద రైల్వే పనుల నిమిత్తం అడ్డంగా వేసిన అడ్డు కట్టవల్ల బీఆర్ నగర్, రాజీవ్ కాలనీ, ఎన్ ఎన్ నగర్, రాజీవ్ గృహ, ఎస్‌ఆర్‌ఆర్ తోట ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం ఉందని అధికారుల దృష్టికి స్థానిక 32వ డివిజన్ కార్పొరేటర్ పల్లం పద్మా రవి తీసుకెళ్లారు. అలాగే పలు ప్రాంతాలను కమిషనర్ ప్రావీణ్య పరిశీలించారు.
వర్ష ధ్వంసం..
వరంగల్ వాయిస్, మహా ముత్తారం: మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షం భారీ నష్టాలను మిగిల్చింది. వరద తాకిడికి మండలం లోని రోడ్లు కొట్టుకుపోయి పెద్ద పెద్ద లోయలుగా మారాయి. పెగడపల్లి వద్ద పెద్దవాగు, ముత్తారం వాగు, దవుత్ పల్లి వాగు ఉగ్రరూపం దాల్చడంతో రోడ్లు, కల్వర్టులు ధ్వంసం అయ్యాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. మండల కేంద్రానికి వెళ్లే దారిలో విద్యుత్ స్తంభం విరిగిపోగా వైర్లు నీటిలో తెలుతున్నాయి. మండలంలో పత్తి పంట ఆలస్యంగా మొదలైంది. విత్తిన విత్తనాలు వర్ష ధాటికి కొట్టుకపోయాయని రైతులు వాపోతున్నారు.
నిండు కుండలా పాకాల..
వరంగల్ వాయిస్, ఖానాపురం: భారీ వర్షాలకు ఖానాపూర్ మండలంలోని పాకాల చెరువులో నీటిమట్టం క్రమ క్రమంగా పెరుగుతోంది. సోమవారం 25 అడుగులకు చేరుకుంది. చెరువు నీటితో నిండుకుండలా మారడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అటవీ గ్రామాలు అతలాకుతలం
వరంగల్ వాయిస్, మల్హర్: గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి మల్హర్ మండలం అతలాకుతలమైంది. గత 30 సంవత్సరాలుగా ఇంతటి భారీ వర్షపాతాన్ని చూడలేదని స్థానిక ప్రజలు అంటున్నారు. కుంభ వృష్టి వానకు కొయ్యూరు దగ్గర ఉన్న రోడ్డు డ్యామ్ ఉప్పొంగడంతో కాటారం-మంథని మధ్య రాకపోకలు స్తంభించాయి. రుద్రారం ఊర చెరువు కట్ట తెగడంతో నీరు మొత్తం కిందికి వెళ్లిపోయింది. మండలంలోని చెరువులన్నీ పూర్తిగా నిండిపోయి ప్రమాదకర పరిస్థితుల్లో ఉప్పొంగు తున్నాయి. బొగ్గుల వాగు, ఆరెవాగు, మానేరు ప్రమాదకర పరిస్థితుల్లో పారుతున్నాయి. తాడిచర్ల వద్దనున్న మానేరు నది ఉప్పొంగి గ్రామపంచాయతీ పరిసర ప్రాంతాలను నీట ముంచింది. కొయ్యూరు సమీపంలోని వాగు వద్ద 200 గొర్రెలు, ఇద్దరు గొర్రెల కాపరులు వరదలు చిక్కుకోవడంతో కొయ్యూరు ఎస్‌ఐ తనుగులు సత్యనారాయణ ఆధ్వర్యంలో వారిని సురక్షితంగా బయటకు రప్పించారు. కొండంపేట గ్రామ ఆమ్లెట్ గ్రామమైన కుంభంపల్లి గ్రామం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎడ్లపల్లి సమీపంలోని బొగ్గుల వాగు ప్రాజెక్టు పూర్తి జలకళ సంతరించుకొని మత్తడి దుంకుతోంది. వరి పొలాల్లో పోసిన నారుమడులన్నీ భారీ వర్షానికి ధ్వంసమయ్యాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తహసీల్దార్ మొగిలి శ్రీనివాస్, ఎంపీడీవో గుండు నరసింహ మూర్తి, కొయ్యూరు ఎస్‌ఐ తనుగుల సత్యనారాయణ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సిబ్బందికి తగిన సూచనలు ఇస్తున్నారు.











