Warangalvoice

warangalvoice

ఉరకలెత్తిన ఉద్యమకారుడు చిన్నబోతున్నడు

  • 14 ఏళ్లు తెలంగాణ కోసం
  • అలుపెరుగని పోరు
  • నేడు ఆదరణ కరువై అతి సాధారణ జీవితం
  • రాజకీయంగానూ చిన్నచూపే
  • చితికిన వేలాది బతుకులు
  • రోడ్డుపాలైన కుటుంబాలు
  • గుర్తింపు కల్పించాలంటున్న ఉద్యమకారులు


మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకే దక్కాలన్న ఉక్కు సంకల్పంతో చేపట్టిన తెలంగాణ మలి దశ ఉద్యమంలో లక్షలాది మంది తెలంగాణ ప్రజలు భాగస్వాములయ్యారు. 2001లో కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుతో ఆడా, మగ, చిన్నా, పెద్దా తేడా లేకుండా సబ్బండ జనాలు ఉద్యమ బాట పట్టారు. చదువు, ఉద్యోగం, వ్యాపారం అన్నీ పక్కనబెట్టి తెలంగాణ కోసం ఉద్యమించారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఉద్యమ బావుటా ఎగురవేశారు. అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పోలీసులకూ కంటి మీద కునుకు లేకుండా చేశారు. వందలాదిమంది జైలు జీవితాన్ని గడిపారు. అయిన ఉద్యమ పంథా వీడలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు అలపెరుగని ఉద్యమాన్ని సాగించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరినా ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యమకారులకు మాత్రం సముచిత గౌరవం లభించడం లేదన్న ఆవేదన వారిలో రగులుతూనే ఉంది. ఇప్పటికైనా ఉద్యమకారులకు తగిన గుర్తింపునివ్వాలన్న డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతోంది.
-వరంగల్‌ వాయిస్‌,వరంగల్‌ ప్రతినిధి

వరంగల్‌ వాయిస్‌, వరంగల్‌ ప్రతినిధి: తెలంగాణ భావజాల ప్రచారం కోసం జరిగిన సభల్లో ముఖ్యమైనది ‘వరంగల్‌ డిక్లరేషన్‌ సభ’. అనేక ప్రజా సంఘాల కలయికతో ‘అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక’ ఆధ్వర్యంలో 1997, డిసెంబర్‌ 28న వరంగల్‌లో ఈ సభ జరిగింది. ఈ సభలోనే కాళోజీ లాంటి కవులు, కళాకారులు అనేక సంస్థలు కలిసి వరంగల్‌ డిక్లరేషన్‌ను విడుదల చేశాయి. 1997, సెప్టెంబర్‌ 28న ప్రొపెసర్‌ జయశంకర్‌, ప్రొపెసర్‌ కేశవరావ్‌ జాదవ్‌ ఆధ్వర్యంలో విడివిడిగా పనిచేస్తున్న 28 సంఘాలు కలిసి ‘తెలంగాణ ఐక్య వేదిక’గా ఏర్పడ్డాయి. 1998, ఫిబ్రవరి 14, 15తేదీల్లో చైతన్య వేదిక ఆధ్వర్యంలో సిద్దిపేటలో సదస్సు జరిగింది. ఇందులో ప్రజాకళామండలి మొదటిసారిగా తెలంగాణపై పాటల పుస్తకాన్ని విడుదల చేసింది. 1969లో ఆమోస్‌ ఆధ్వర్యంలో ఏర్పడిన టీఎన్‌జీఓ సంఘం, గాదె ఇన్నయ్య ఆధ్వర్యంలోని తెలంగాణ స్టడీ సర్కిల్‌, బెల్లయ్యనాయక్‌ నాయకత్వంలోని తెలంగాణ సంఘర్షణ సమితి, కేశవరావ్‌ జాదవ్‌, విమలక్క నేతృత్వంలోని తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ వంటి చాలా సంస్థలు ఉద్యమ బాట పట్టాయి. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా 200లకు పైగా ఉద్యమ సంస్థలు ఏర్పాటయ్యాయి. ఈ సంస్థల పోరాటమే 2001లో కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సమితి అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి ప్రేరణ అయింది.
వెన్ను చూపని ఉద్యమం..
టీఆర్‌ఎస్‌ ఏర్పాటుతో ఉద్యమం మరింత ఊపందుకుంది. విద్యార్థి, ఉద్యోగ, కుల సంఘాలు పార్టీలు, మతాలను పక్కన బెట్టి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగారు. సడక్‌ బంద్‌, రాస్తారోకో, వంటా వార్పు, సకల జనులు సమ్మె ఇలా ఎవరికి తోచిన విధంగా వారు ఉద్యమంలో పాల్గొన్నారు. కళాకారులు ఆటా పాటలు, ధూంధాంలతో ప్రజలను ఉర్రూతలూగించారు. దీంతో జనం ఉప్పెనలా తరలి వచ్చి ఉద్యమంలో పాల్గొన్నారు. 14 సంవత్సరాలపాటు అలుపెరుగని ఉద్యమం నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అకాంక్ష నెరవేరే వరకు వెనుకడుగు వేయలేదు. ఎట్టకేలకు 2014 జూన్‌ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరది.
చితికిన వేలాది బతుకులు..
కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుతో అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. విద్యార్థులు చదువులను పక్కన బెట్టారు. కార్మికులు పనులను వదిలేశారు. ఉద్యోగులు తమ విధులను నిర్వహిస్తూనే ఉద్యమానికి ఊత మిచ్చారు. అయితే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, కార్మికులు, ఉద్యమకారులే తీవ్రంగా నష్టపోయారు. ఉద్యమ సమయంలో తిండీ తిప్పలు మాని ఉన్న ఆస్తులను పోగొట్టుకున్న వేలాది ఉద్యమ కారుల కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయి. ఉద్యమానికి ముందు దర్జాగా బతికిన ఎంతో మంది నేడు అన్నీ పోగొట్టుకొని అతి సాధారణ జీవితం గడుపుతున్నారు.
అండగా నిలువని ప్రభుత్వం..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యమకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భావించిన వారి ఆశలు అడియాశలు అయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ ఎంతో మంది ఉద్యమ కారులు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వారిపై కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థులు 14 సంవత్సరాలపాటు చదువులను పక్కన బెట్టి ఉద్‌కమం చేస్తే వారి ఏజ్‌ బార్‌ కావడంతో నేటికీ నిరుద్యోగులుగానే మిగిలారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారి మాదిరిగానే తెలంగాణ వస్తే ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం అందుతుంది అనుకున్నవారి కలలు కల్లలుగా మారాయి.
రాజకీయంగానూ చిన్నచూపే..
సర్వస్వం కోల్పోయి మొదటినుంచి ఉద్యమంలో పాల్గొన్న వారికి పార్టీలో తగిన గుర్తింపు లభించడంలేదని ఉద్యమకారులు మదనపడుతున్నారు. 2001నుంచి రాజకీయ పార్టీగా టీఆర్‌ఎస్‌ ఉంటూనే ఉద్యమానికి నాయకత్వం వహించినా నేడు ఆ పార్టీలో ఆదరణ లభించడంలేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఉద్యమం ఊసే ఎత్తని కొత్త వారు పార్టీలోకి రాగానే వారికి పదవులు కట్టబెడుతూ సీనియర్‌ పార్టీ నాయకులను పక్కనబెడుతున్నారంటూ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏజ్‌ బార్‌ కావడంతో అటు ఉద్యోగం లభించక కనీసం రాజకీయంగానూ గుర్తింపు లభించక పోవడంతో ఏమి చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు.
ఎన్నికల సమయంలోనే..
ఎన్నికల సమయంలోనే ఉద్యమకారుల గురించి ప్రస్తావిస్తున్న నేతలు అవి ముగియగానే వారిని మరిచిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం ఉద్యమ కారులకు చేసిందేమి లేదంటూ పలువురు ఉద్యమ కారులు మండిపడుతున్నారు. ఎన్నికల వేల ఇది చేస్తాం.. అది చేస్తాం అంటూ సామాన్య ఓటర్లను మభ్య పెట్టినట్లుగా ఉద్యమకారులను మభ్య పెడుతున్నారే తప్ప వారి గురించి పట్టించుకునేవారే కరువయ్యారని పలువురు నొచ్చుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *