- అధికారులు తీరుపై విమర్శలు
వరంగల్ వాయిస్, వర్ధన్నపేట : మండలంలోని కడారి గూడెం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకంపై గ్రామస్తులు వారి ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. గ్రామస్తులకు కావలసిన పనులు చేపట్టకుండా గ్రామానికి కావలసిన పనులను నిర్ణయించి వాటిపై గ్రామస్తులతో, కార్మికులతో చర్చించకుండా పనులు చేపట్టడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో గ్రామం నుంచి చెరువులోకి వెళ్లే నీరుని సజావుగా వెళ్లనీయకుండా ఆపుతున్న కాలువను సక్రమంగా తీర్చిదిద్దకుండా దానిని నిర్లక్ష్యం చేస్తూ అనవసరంగా చెరువులో బొందలు తీస్తూ ఆ మట్టిని తరలిస్తూ వృధా చేస్తున్నారని, దీంతో ఎటువంటి ఉపయోగం ఉండదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత వర్షాకాలంలో అతివృష్టి కారణంగా వరదలు ఎక్కువగా వచ్చి వరద చెరువులోకి వెళ్లే దారి లేకుండా చెరువు పక్కనే ఉన్న ఇండ్లు మునిగిపోవడం వల్ల ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు. ఆ కాలువలను శుభ్రం చేసి నీరు వెళ్లే విధంగా ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకోవచ్చని, అయినా కూడా ఆ పథకాన్ని ఆ పనికి ఉపయోగించకుండా వారి సొంత నిర్ణయాలతో అధికారులు పనులు చేపట్టడం వల్ల గ్రామానికి ఎటువంటి లాభం జరగడం లేదని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలు లబ్ధి పొందుతున్నారు తప్ప ఆ పని ద్వారా గ్రామానికి చేకూరిన లాభం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ఫీల్డ్ ఆఫీసర్లు వెంటనే గ్రామం నుంచి ప్రధానంగా చెరువులోకి వెళ్లే వరద కాలువను ఉపాధి హామీ పథకంలో శుభ్రపరిచి ముంపుకు గురయ్యే నివాసాలను పరిరక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆక్రమణకు గురవుతున్న చెరువును రక్షించాలని గ్రామ ప్రజలు అధికారులను డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగుతామని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు.
