ఈ గుంతల లోతు.. పాలకుల నిర్లక్ష్యమంత!
అధ్వానంగా నర్సంపేట -కొత్తగూడెం ప్రధాన రహదారి
ఎమర్జెన్సీ వాహనాలకు తప్పని ఇక్కట్లు
ప్రభుత్వాలు మారినా.. మారని దుస్థితి..!
అదమరిచి జాలీగా ఆ రోడ్డుపై ప్రయాణించారా? ఇక అంతే సంగతులు.. నరకానికి డైరెక్ట్ టికెట్ తీసుకున్నట్టే.. ఏళ్ల తరబడిగా ఆ రోడ్డును పట్టించుకున్న వాళ్లు లేరు.. ప్రయాణికుల గోడు విన్నవాళ్లు లేరు.. వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి కొత్తగూడెం వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. రోడ్డుపై గుంతలతో వాహనదారులు నానా యాతన పడుతున్నారు. ఇక ఎమర్జెన్సీ వాహనాల పరిస్థితి అయితే దారుణం. ఇటీవల ఓ అంబులెన్స్ దిగబడడంతో వేరే వాహనం తీసుకొచ్చి బయటకు లాగి.. పేషెంట్ ను అత్యవసరంగా నర్సంపేట ఆస్పత్రికి తరలించారు.
వరంగల్ వాయిస్, ఖానాపూర్
వరంగల్ వాయిస్, ఖానాపూర్: పాలకులు మారినా.. ప్రభుత్వాలు మారినా పల్లెల రూపురేఖలు మాత్రం మారటం లేదు. పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాలు ఎన్నో ప్రారంభించినా ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితం అవుతున్నాయి తప్పా ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి కొత్తగూడెం వెళ్లే రహదారి దయానీయంగా మారింది. రోడ్డుపై గుంతలు ఏర్పడి పాలకుల నిర్లక్ష్యాన్ని సాక్షాత్కరిస్తున్నాయి. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ రోడ్డు ప్రసిద్ధ పాకాల సరస్సుకు వెళ్లే మార్గం కావటంతో నిత్యం అనేక ప్రాంతాలనుంచి పర్యాటకులు ఈ మార్గం గుండా ప్రయణిస్తుంటారు. రోడ్డు అధ్వానంగా మారడంతో ఎక్కడ ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. నర్సంపేట నుంచి పాకాల, కొత్తగూడ, ఇల్లందు, భద్రాచలం వెళ్లే రహదారి శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. భారీ గుంతలతో రోడ్డు భయానకంగా మారిపోయింది. అంబులెన్స్ లో అత్యవసర సమయాల్లో రోగులను తరలిస్తున్న సందర్భాల్లో అనేక సార్లు రోడ్డుపై వాహనాలు ఇరుక్కుంటున్నాయి. ఇటీవల ఓ అంబులెన్స్ రోడ్డు గుంతల్లో ఇరుక్కోవడంతో మరో వాహనం సహాయంతో బయటికి తీసి త్వరగా నర్సంపేట హాస్పిటల్ కి రోగిని తరలించారు. ఈ సంఘటన చిలకనగర్ శివారు పాకాల దగ్గరలో జరిగింది. ప్రయాణికులు రాత్రి పగలు తేడా లేకుండా ఈ రోడ్డుపై ప్రయాణిస్తూ ఉంటారు.. ఏ సమయంలో ఏం జరుగుతుందోనని ప్రాణాలు చేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి రోడ్డు మరమ్మతు చేయాలని కోరుతున్నారు.

