మూడు వందలకు పైగా మృతులు
వేయికి పైగా క్షతగాత్రులు
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని, సిఎం నవీన్ పట్నాయక్
మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం
వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ/బాలాసోర్ : ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదమే ఈ దశాబ్ద కాలంలో జరిగిన అతి పెద్ద రైలు ప్రమాదంగా భావిస్తున్నారు. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైల్లు ఢీకొన్న ఘటనలో 300మందికి పైగా మృతి చెందగా, వేయికి పైగా క్షతగాత్రులయ్యారు. పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్ నుంచి చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు ప్రయాణిస్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (12841) శుక్రవారం రాత్రి 7.20 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి సమీపంలో పట్టాలు తప్పి గూడ్స్ రైలును ఢీకొంది. ఈ ఘటనలో 13 బోగీలు పట్టాలు తప్పాయి. కోరమండల్ రైలు బోగీలపై యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ దూసుకెళ్లింది. ఘటనలో యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 4 బోగీలు పట్టాలు తప్పాయి. రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఘటనాస్థలంలో 200 అంబులెన్స్‌లు సహాయక చర్యలు అందిస్తున్నాయి. రైలు ప్రమాద ఘటనతో రైల్వే శాఖ 18 రైళ్లను రద్దు చేసింది. రైలు ప్రమాదంలో చనిపోయినవారికి రైల్వేశాఖ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందించనున్నట్టు తెలిపింది. ఇక తీవ్రంగా గాయపడినవారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించనుంది.
ప్రధాని పర్యటన..
ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురికావడంతో ప్రధాని మోడీ శనివారం సాయంత్రం సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడినుంచి నేరుగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్న భద్రక్ ఆస్పత్రికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. ఎవరూ అధైర్య పడొద్దని ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా సంఘటన ప్రాంతాన్ని సందర్శించారు. అయితే సంఘటనపై అత్యున్నత స్థాయి దర్యాప్తు నిర్వహిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం ప్రకటించారు. సహాయక చర్యలపైనే తాము ముఖ్యంగా దృష్టి సారించామని, బాధితులకు వైద్య సహాయం అందించడమే తమ మొదటి కర్తవ్యమన్నారు. 2016 నవంబర్ 20న ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ 19321 కాన్పూర్‌లోని పుఖ్రాయాన్ సవిూపంలో పట్టాలు తప్పడంతో దాదాపు 150 మంది ప్రయాణికులు మరణించగా..మరో150 మందికి పైగా గాయపడ్డారు. ఇదే మన దేశంలో జరిగిన అతి పెద్ద రైలు ప్రమాదం. ఇప్పుడు జరిగిన ప్రమాదంలో దీనికి రెట్టింపు మృతి చెందగా వేలల్లో క్షతగాత్రులున్నారు.
