Warangalvoice

We don't want this job

ఈ కొలువు మాకొద్దు

  • అరకొర వేతనం.. వెట్టిచాకిరీతో సతమతం
  • నెరవేరని పాలకుల హామీలు
  • పట్టించుకోని ప్రభుత్వం
  • 9 నుంచి వీఆర్‌ఏల నిరసన బాట

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరిస్తాం.. వయోభారంతో ఇబ్బంది పడుతున్న వారి కుటుంబంలో ఎవరికైనా ఒకరికి ఉద్యోగమిచ్చి ఆదుకుంటాం..అర్హతగల వారందరికీ ప్రమోషన్లు ఇవ్వడంతోపాటు పే స్కేల్‌ వర్తింపజేస్తామంటూ 2020 సెప్టెంబర్‌ 9న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు. ఎనిమిది సంవత్సరాలుగా ఉద్యోగ భద్రత లేక చాలీచాలని జీతంతో, వీఆర్‌ఏలు వెట్టి చాకిరి చేస్తున్నారు. ఆరు నెలలుగా పలుమార్లు నిరసన తెలిపినా పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఈనెల 9నుంచి సమ్మెబాట పడుతున్నారు.

-వరంగల్‌ వాయిస్‌, మహబూబాబాద్‌

వరంగల్‌ వాయిస్‌, మహబూబాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల మంది వీఆర్‌ఏ (గ్రామ రెవెన్యూ సహాయకు)లు ఉన్నారు. వీరందరికీ న్యాయం చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. కొత్త రెవెన్యూ చట్టం ఆమోదం సందర్భంగా వీఆర్‌ఎలను క్రమబద్ధీకరిస్తామని, పే స్కేలు వర్తింపజేస్తామని 2020 సెప్టెంబర్‌ 9న అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. వయోభారంతో ఇబ్బంది పడుతున్న వీఆర్‌ఏల కుటుంబ సభ్యుల్లో అర్హులుంటే వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. ఈ హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదు. దీంతో ఆరు నెలలుగా వీఆర్‌ ఏలు దశలవారీగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. జూన్‌ 21న హైదరాబాద్‌లోని భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడిరచేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకొని పోలిస్‌ స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రవ్యా ప్తంగా అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట గురువారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

ప్రభుత్వ ఉద్యోగమని నమ్మి..

టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలు లేకపోవడంతో చాలా మంది నిరుద్యోగులు ఏదో ఒక ప్రభుత్వ పోస్టులో చేరేందుకు సిద్ధపడ్డారు. పీజీ పూర్తి చేసి గ్రూప్స్‌ కోసం ప్రిపేరయ్యేవారు కూడా వీఆర్వో, వీఆర్‌ఏ ఉద్యోగ నోటిఫికేషన్‌ రావడంతో పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించారు. చదివింది పీజీ కాని చేసే ఉద్యోగం గ్రామ రెవెన్యూ సహాయకుడి పోస్టు అయినప్పటికీ ప్రమోషన్లతో ఉన్నత పోస్టులోకి పోవచ్చు కదాని సంతృప్తి చెందారు.

వెట్టి చాకిరితో సతమతం..

గవర్నమెంట్‌ ఉద్యోగమని వీఆర్‌ ఏగా విధుల్లో చేరారు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు నిత్యం వెట్టిచాకిరే. వీఆర్‌ఏలకు నిత్యం పనిభారం తప్పడం లేదు. సదరు మండల అధికారి వారిని నిత్యం ఏదో ఒక పనికి తిప్పడం పరిపాటిగా మారింది. పని ఉన్నా లేకున్నా రోజు ఆఫీస్‌ కు రావాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. గ్రీవెన్స్‌ సమస్యలు పరిష్కరించడంతో పాటు గ్రామాల్లో పెండిరగ్‌ పనుల ఫీడ్‌ బ్యాక్‌ కూడా వీరే అందించాలంటూ ఆదేశిస్తున్నారు. ఉదయం లేచింది మొదలు అర్ధరాత్రి వరకు నిత్యం ఏదో ఒక పనితో సతమతమవ్వాల్సి వస్తోంది. పై అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా వీరిపై మరింత పనిభారం వేస్తూ చేతులు దులుపుకోవడం నిత్య కృత్యంగా మారింది. నిత్యం వెట్టిచాకిరీ చేయిస్తున్న ఉన్నతాధికారులు మాత్రం వీరి గోడు పట్టించుకోవడం లేదు. దీంతో ఈ ఉద్యోగం మాకొద్దు అనే పరిస్థితి నెలకొంది.

చాలీచాలనీ వేతనాలు..

పేరుకే సర్కారు కొలువు.. కాని వేతనం అంతంత మాత్రమే.. పనులు మాత్రం బోలెడు.. అన్న చందంగా వీఆర్‌ ఏల బతుకులు సాగుతున్నాయి. అరకొర వేతనంతో నానా యాతన పడుతున్నారు. ఈ ఉద్యోగంతో ఆర్థికంగా ఎదగకపోవడం అటుంచితే వెట్టిచాకిరీతో సరైన సమయ పాలన లేక సర్వరోగాలు వీఆర్‌ ఏలపై దాడి చేస్తున్నాయి. ఉద్యోగం సంపాదించిన వారిలో ఎలాంటి అతిగతి లేకపోవడం గమనార్హం. ప్రమోషన్ల మాట అటుంచితే పే స్కేల్‌ మాటే మరిచారు. గవర్నమెంట్‌ ఉద్యోగులకు ఉండాల్సిన సౌకర్యాలు, వసతులు వీరికి ఏ మాత్రం వర్తించడంలేదు. కనీసం ప్రైవేటు ఉద్యోగులకు వర్తిస్తున్న పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యాలు కూడా వీరికి లేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఎనిమిది సంవత్సరాలనుంచి ఎలాంటి ప్రమోషన్లు, పే స్కేల్‌, ఇతర సౌకర్యాలు రాకపోవడంతో జిల్లాలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు వీఆర్‌ఏలు ఇటీవల ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు.

కదం తొక్కేందుకు సిద్ధం..

ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సదుపాయాలను కల్పించాలని, వెంటనే పదోన్నతులు కల్పించాలని, విధులు నిర్వహిస్తున్న వారిని క్రమబద్ధీకరించాలని కోరుతూ రాష్ట్ర వ్యప్తంగా ఉన్న వీఆర్‌ ఏలు కదం తొక్కేందుకు సిద్ధపడుతున్నారు. ఆరు నెలలుగా వివిధ రూపాల్లో నిరసన తెలిపిన వీరు ఈనెల 9నుంచి సమ్మె బాట పట్టనున్నారు. వీరికి తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం మద్దతుగా నిలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *