Warangalvoice

If you study with interest.. Desired job

ఇష్టపడి చదివితేనే.. కోరుకున్న కొలువు

  • అపోహలు వీడి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి..
  • బట్టీ పట్టొద్దు.. సమగ్ర అధ్యయనం చేయాలి
  • ఏకాగ్రతతో చదివితేనే లక్ష్యసాధన
  • సువర్ణావకాశాన్ని జారవిడుచుకోవద్దు
  • రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.పార్థసారథి
  • ఆదిలాబాద్‌లో ఉద్యోగార్థులకు అవగాహన

‘‘తమపై తమకు గట్టి నమ్మకం ఉన్నవాళ్లనే విజయం వరిస్తుంది.. అపోహలు వీడి దృఢ సంకల్పంతో ముందుకు దూసుకెళ్లిన వారే విజేతలుగా నిలబడుతారు.. దురాలవాట్లకు దూరంగా ఉంటూ మానసిక ఒత్తిడిని చిత్తు చేస్తూ సడలని ఏకాగ్రతతో చదివితే కోరుకున్న కొలువు సాధించడం అసాధ్యమేమీ కాదు..’’ అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.పార్థసారథి ఉద్యోగార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందింపజేశారు. మంగళవారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో పోటీపరీక్షలపై నిరుద్యోగ యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్థసారథి అద్భుతమైన మోటివేషనల్‌ స్పీచ్‌ ఇచ్చారు. పోటీ పరీక్షల్లో ప్రిపరేషన్‌ విధానంపై విలువైన సూచనలు, సలహాలు అందించారు.

వరంగల్‌ వాయిస్‌, ఆదిలాబాద్‌ : యువత నిరాశ, నిస్పృహలను దరిచేరనివ్వకుండా గట్టి సంకల్పంతో ప్రయత్నించాలని, ఆ ప్రయత్నానికి ఏకాగ్రత తోడైతే ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి. పార్థసారథి సూచించారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మార్గనిర్ధేశం చేశారు. ఉద్యోగ సాధనలో భాగంగా నిరుద్యోగ అభ్యర్థులు పాటించాల్సిన మెలకువలను అర్థవంతంగా, ఆకట్టుకునే రీతిలో వివరిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేశారు. తన స్వీయ అనుభవాలను జోడిరచి పలు అంశాలపై అవగాహన కల్పించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పలు అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే ఈసారి అభ్యర్థులకు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని, వాటిని సద్వినియోగం చేసుకొని కొలువులు దక్కేలా కృషి చేయాలని సూచించారు. తమపై తాము గట్టి నమ్మకంతో కష్టపడ్డపుడే విజేతలవుతారని పేర్కొన్నారు. అనుకున్నది సాధించాలంటే కొన్ని త్యాగం చేయక తప్పదని పేర్కొన్నారు. యువత దురలవాట్లకు దూరంగా ఉంటూ, మానసిక ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకుసాగాలని సూచించారు. పోటీ పరీక్షలంటే భయం, అపోహలు ఎక్కువ అని, వాటితోపాటు వాయిదా వేయడం, బద్ధకం, ఆత్మన్యూనత భావం, మొహమాటం విడిచిపెట్టాలని, తమపై తాము నమ్మకం పెంచుకోవాలన్నారు. పరీక్షలో ప్రతీ ప్రశ్న, ప్రతీ మార్కు కీలకమన్నారు. ఏకాగ్రత, స్థిరత్వంతో విషయ పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటూ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. ఆత్మన్యూనతకు లోనుకావద్దని, నమ్మకంతో ఉద్యోగ సాధన దిశగా అడుగులు వేయాలన్నారు. అనవసర విషయాల గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేయకుండా, తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడంపైనే దృష్టి సారించాలని ఉద్బోధించారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం, శక్తి, సామర్థ్యం ఉంటుందని, తమ మీద తాము నమ్మకం ఉంచి కష్టపడ్డవారే విజయం సాధిస్తారని తెలిపారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నుంచి వస్తున్న నోటిఫికేషన్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇదో సువర్ణావకాశమని, ఇలాంటి అవకాశం మళ్లీ రాకపోవచ్చని పేర్కొన్నారు. త్వరలో రాష్టంలో ఉద్యోగ విప్లవం రానుందని, ఇప్పటికే గ్రూప్‌ 1, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ నోటిఫికేషన్లు వచ్చాయని, త్వరలోనే గ్రూప్‌ 2, 4 ఇతర ఉద్యోగ ప్రకటనలు కూడా రానున్నాయని వివరించారు. గ్రూప్‌ -1 కు సంబంధించి ప్రిలిమినరీ, మెయిన్స్‌ లో అడిగే ప్రశ్నలు, అందుకోసం అభ్యర్థులు ఎలా చదవాలో విశ్లేషణాత్మకంగా వివరించారు. బట్టి పద్ధతిలో కాకుండా సమగ్రంగా అధ్యయనం చేయాలని, చదివిన అంశాలను అర్థం చేసుకొని, అవగాహన చేసుకోవాలన్నారు. అభ్యర్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు. పక్కా ప్రణాళికతో సంసిద్ధులైతే ఉద్యోగం సాధించడం కష్టతరమేమి కాదని, ఏకాగ్రతతో చదివి యువతీ యువకులు తాము కోరుకున్న కొలువును దక్కించుకొని బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఇది ఒక మంచి అవకాశమన్నారు. వివిధ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఎస్సీ, బీసీ, మైనారిటీ స్టడీ సర్కిళ్ల ద్వార ఉచిత శిక్షణ ఇవ్వడంతోపాటు స్టడీ మెటిరియల్‌ కూడా అందజేస్తున్నామన్నారు. ఎస్పీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. అభ్యర్థులు నోటిఫికేషన్లు వెలువడినప్పుడు చూపిన ఉత్సాహాన్ని పరీక్ష పూర్తి చేసే వరకు నిరంతరం కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌ భాషా షేక్‌, అదనపు కలెక్టర్‌ ఎన్‌. నటరాజ్‌, ఆర్డీవో రమేష్‌ రాథోడ్‌, జిల్లా పరిషత్‌ సీఈవో గణపతి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌, దళిత అభివృద్ధి అధికారి సునీత, బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, మైనార్టీ సంక్షేమ అధికారి కృష్ణవేణి, యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్లు, సమాచార పౌర సంబంధాల అధికారి ఎన్‌. భీంకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్‌ లో ఘన స్వాగతం
ఆదిలాబాద్‌ లో ఉద్యోగార్థుల అవగాహన సదస్సుకు వచ్చిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సి. పార్థసారథికి మార్గ మధ్యంలోని నిర్మల్‌ ఫారెస్ట్‌ గెస్ట్‌ హౌస్‌ లో జిల్లా పాలనాధికారి ముషార్రఫ్‌ ఫారుఖీ, ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌, అదనపు కలెక్టర్లు హేమంత్‌ బోర్కడే, పి.రాంబాబు పుష్ప గుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించి ఉన్నతాధికారులతో జిల్లా ప్రగతిపై ముచ్చటించారు. ఇందులో ఆర్డీవో తుకారం, డీపీఆర్వో తిరుమల తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *