రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్ ఎంపిల రాజీనామా యోచన?
రాజకీయ ప్రత్యామ్నాయాలపై చర్చిస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలు వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: ఇందిర అడుగజాడల్లో రాహుల్ రాజకీయ సోపానం నిర్మించుకోవాలని చూస్తున్నారు. జైలుకు వెళ్లడం ద్వారా సానుభూతికి యత్నం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్ ఎంపిల రాజీనామా యోచనలో కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఏది చేస్తే లాభమో అన్న తీరులో రాజకీయ ప్రత్యామ్నాయాలపై కాంగ్రెస్ అగ్రనేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇందిరాగాంధీ ఆదర్శంగా రాహుల్ గాంధీ అడుగులు వేస్తున్నారు. 1977 లో అనర్హత వేటు పడినప్పుడు కొద్ది రోజులపాటు ఇందిరమ్మ జైల్లో ఉన్నారు. దీంతో ఆమెకు ప్రజల్లో భారీగా ఇమేజ్ పెరిగింది. ఇదే తరహాలో ఇప్పుడు తన రాజకీయ జీవితాన్ని మలచుకోవాలని యోచిస్తున్నారు. అలాగే వయనాడ్‌కు ఉప ఎన్నిక వస్తే తన స్థానంలో ప్రియాంకను పార్లమెంట్‌కు పంపించే విషయాన్ని కూడా రాహుల్ చర్చిస్తున్నాట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీకి మద్దతుగా మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు కాంగ్రెస్ ఎంపీలు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ సైతం జైలుకు వెళ్లేందుకే సిద్ధపడుతున్నట్టు సమాచారం.ఎంపీలు మూకమ్మడిగా రాజీనామా చేసే అంశాన్ని కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తోంది. ఎందుకంటే లోక్‌సభలో ఎలాగూ చర్చలకు అవకశాం లేదు. మాట్లాడేందుకు అవకాశం రావడం లేదు. దీనిని సాకుగా చేసుకుని ప్రజాక్షేత్రంలో మరింత బలపడాలని కాంగ్రెస్ యోచిస్తోంది. త్వరలో సూరత్ లేదా ఢిల్లీలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అధిష్టానం ప్రణాళిక సిద్దం చేస్తోంది. మరోవైపు రాహుల్‌పై అనర్హత వేటు ప్రతిపక్షాల ఐక్యతకు మార్గం ఏర్పడిరది. మహారాష్ట్రలో శరద్ పవార్, ఉద్ధవ్‌ఠాక్రే, ఢిల్లీలో కేజీవ్రాల్, తమిళనాడులో స్టాలిన్, బెంగాల్‌లో మమత నుంచి తెలంగాణలో కేసీఆర్ వరకూ విపక్షనేతలు స్పందించిన తీరు ఇందుకు ఉదాహరణగా చూడాలి. రాహుల్‌పై వేటుతో రాబోయే రోజుల్లో రాజకీయ పర్యవసానాలు తీవ్రంగా ఉండనున్నాయని విశ్లేషించాయి. ప్రతిపక్ష నేతల స్వరాన్ని తొక్కిపట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని శరద్ పవార్ ఆరోపిస్తే.. ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రతిపక్షాలు ఏకం కావాలని ఆర్జేడీ నేత తేజస్వియాదవ్, శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే, ఆప్‌నేత కేజీవ్రాల్ పిలుపునిచ్చారు. వారంతా స్పందించిన తీరు చూస్తే.. దేశంలో త్వరలో ప్రతిపక్షాల నేతృత్వంలో బలమైన ఫ్రంట్ ఏర్పాటుకు అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జనతాపార్టీ తరహాలో ఉమ్మడిగా ఫ్రంట్ లేదా కూటమితో ముందుకు సాగాలని చూస్తున్నాయి. కాంగ్రెస్ కూడా ఇప్పుడు తన నాయకత్వం గురించి ఆలోచించే పరిస్థితిలో లేదని, అన్ని పార్టీలతో కలిసి పోరాడేందుకే సమాయత్తమవుతోంది. జైలుకు వెళ్లడం ద్వారా రాహుల్ పట్ల దేశంలో మరింత ఆదరణ పెరగగలదని కూడా భావిస్తున్నారు. అయితే అన్నవిషయాలను, అనేక మార్గాలను కాంగ్రెస్‌తో పాటు ఇతర నేతలు కూడా చర్చిస్తున్నారు. ఎలా వెళితే మోఢీని ఢీకొనగలమో అన్న ఆలోచనలో విపక్ష పార్టీలు మేధోమధనం చేస్తున్నాయి.