హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
వరంగల్ వాయిస్, కలెక్టరేట్ : బక్రీద్ పండుగ సందర్భంగా ఆవుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరించారు. జంతు హింస నిరోధక సొసైటీ జనరల్ బాడీ సమావేశం హనుమకొండ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి హనుమకొండ జిల్లా కలెక్టర్, చైర్మన్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన ఈ నెల 10న జరగనున్న బక్రీద్ పండుగ సందర్భంగా ఆవుల అక్రమ రవాణా నిరోధించడానికి గో వధ నిరోధక చట్టం కింద పశు సంవర్ధక శాఖ, పోలీస్, అటవీ శాఖ, రవాణా, మార్కెటింగ్ శాఖల ఎన్.జి.ఓ.ల సంయుక్త కార్యాచరణ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనలను పాటించకుండా మూగ జీవాలను క్రూరత్వంగా రవాణాచేసే వాహనాలను సీజ్ చేయాలని, యజమానులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డా.కె.వెంకటనారాయణ, జడ్పీ సీఈవో ఎస్. వెంకటేశ్వరరావు, హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్, మున్సిపల్ వెటర్నరీ ఆఫీసర్ గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.
