వరంగల్ వాయిస్, హనుమకొండ : ఆరోగ్యదర్శిని 10వ వార్షికోత్సవ సంచికను, నూతన సంవత్సర క్యాలెండర్ ను హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , సీనియర్ జర్నలిస్ట్ , వరంగల్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి బుధవారం ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రముఖ హోమియో వైద్యుడు డాక్టర్ పావుశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆరోగ్యదర్శిని పక్షపత్రిక పదేళ్లుగా నిర్విరామంగా వెలువరించడం అభినందనీయమన్నారు. అలాగే ఉచిత హోమియో క్యాంపులు నిర్వర్తిస్తూ ప్రజలకు హోమియోపతిపై అవగాహన కల్పించడంలో విశేష కృషి చేస్తున్నారన్నారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం గడ్డం కేశవమూర్తి మాట్లాడుతూ ఒకవైపు వైద్యం చేస్తూనే మరొకవైపు ఆరోగ్య దర్షిని పక్షపత్రికను 10 సంవత్సరాలుగా కొనసాగించడం హర్షణీయమన్నారు. సమాజానికి విలువైన ఆరోగ్య సూచనలు ఇచ్చే ఆరోగ్య దర్శిని పక్షపత్రిక ఎంతగానో ప్రజలకు ఉపయోగపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఇటువంటి ఆరోగ్య సమాచార పత్రిక 10 సంవత్సరాలుగా డాక్టర్ శ్రీధర్ సంపాదకత్వంలో మన వరంగల్ నుంచి వెలువడుతుండడం గొప్ప విషయమన్నారు. నూతన సంవత్సరం అందరూ ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఆనందంగా జీవించాలని తెలిపారు. అనంతరం ఆరోగ్య దర్శిని పక్షపత్రిక ఎడిటర్ డాక్టర్ పావుశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచమంతా ఆరోగ్యం గురించి పరితపిస్తూ అనారోగ్యం గురించి కలత చెందుతుందన్నారు. నేడు వస్తున్న వ్యాధులకు రూ.వేల నుండి లక్షల రూపాయలు ఖర్చు అయినా కూడా కొన్ని సమస్యలు నయం కావడం లేదన్నారు, ఇప్పుడిప్పుడే ప్రజలు ప్రత్యామ్నాయ మార్గం గురించి అన్వేషిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో అత్యంత సరళ వైద్య విధానాలకు రోజురోజుకీ ఆదరణ పెరుగుతుందన్నారు. ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ ఆరోగ్యంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ ఆరోగ్య దర్శిని పక్షపత్రికను నడపడం జరుగుతుందన్నారు. ఈ ప్రయాణంలో సహకరిస్తున్నటువంటి పాఠకులకు, మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారి విజయ్, దేవేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పీ.విజయ్, రాజు ప్రసాద్, రాజు, వెంకట్, రాజేందర్, సతీష్, సంతోష్, కోమాకుల మధు, కోచ్ కూరపాటి రమేష్, పెరుమాండ్ల వెంకట్, రాజు, కృష్ణ, రాజిరెడ్డి, మోహన్ రావు, భిక్షపతి, శశి, చంటి తదితరులు పాల్గొన్నారు.
