- చకచకా పనులు కానిస్తున్న అధికారులు
- ఉగాది తరవాత మకాం మార్చే యోచన
వరంగల్ వాయిస్,విశాఖపట్టణం: విశాఖలో సిఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖ నుంచి పాలన చేసే అంశంపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే సిఎం ప్రకటించ నున్నారని సమాచారం. ఉగాది తర్వాత అక్కడ నుండే పరిపాలన జరగనుంది. దీనికోసం స్థానిక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ పీఠాధిపతి స్వరూపానంద ఆశిస్సులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన పెట్టిన ముహూర్తానికి ఓకే చెప్పనున్నారని సమాచారం. సుప్రీం కోర్టు, హైకోర్టులో కేసులు ఉన్న నేపథ్యంలో పరిపాలనా రాజధానిపై పూర్తి స్థాయి ప్రకటన, స్పష్టత ఇవ్వకపోయినా సిఎంఒను మాత్రం విశాఖలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రిషికొండ, భీమిలికి ఆనుకుని ఉన్న ప్రాంతాలను ప్రభుత్వం విఐపి జోన్‌గా గుర్తించినట్లు తెలిసింది. రిషికొండపై ఏర్పాటు చేసే భవనాల్లోనే సిఎంఒ ఉండనుంది. దానికి ఆనుకుని ఉన్న నిర్మాణాల్లోనే సిఎంఒ అధికారులు, కొన్ని ప్రధాన విభాగాల హెచ్‌ఒడిలు ఏర్పడనున్నాయి. భీమిలి, విశాఖపట్నం మధ్యలో అన్ని ప్రాంతాలనూ కలిపే విధంగా రవాణా వ్యవస్థనూ ఏర్పాటు చేయనున్నారు. అత్యవసరం అయితే కొన్ని కార్యాలయాలను ఆంధ్రా యూనివర్సిటీకి సంబంధించిన భవనాల్లోనూ పెట్టే అవకాశం ఉందని తెలిసింది. . ఇప్పటికే విశాఖ బీచ్‌రోడ్డు, ఇతర రోడ్లనూ అభివృద్ధి చేస్తున్నారు. భీమిలి వరకూ ఎటువంటి అడ్డంకులూ లేకుండా రవాణా సదుపాయం ఏర్పాటు చేశారు. రిషికొండకు ఆనుకుని ఉన్న భవనాలను కార్యాలయా లుగా, అధికారుల నివాస ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగానే సిఎంఒలో పనిచేసే సిబ్బంది ఇప్పటికే విశాఖలో నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. పలువురు ఇప్పటికే అక్కడకు వెళ్లి వచ్చారు. ప్రస్తుతం రిషికొండపై జరుగుతున్న నిర్మాణాల్లోనే సిఎంఒ ఉండొచ్చని, దానికి ఆనుకుని ఉన్న నిర్మాణాల్లో పలువురు ఉన్నతాధికారుల కార్యాలయాలు ఉంటాయని తెలిసింది. పరిపాలనకు సంబంధించి పలు విభాగాల కార్యాలయాలు అమరావతిలోనే ఉంటాయని, కొన్నిటిని మాత్రమే విశాఖ తరలిస్తారనే ప్రచారం జరుగుతోంది. కార్యాలయాలు తరలిస్తే ఖర్చు హెచ్‌ఒడిల నుండి వసూలు చేస్తామని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వారు కూడా ఆందోళనలో ఉన్నారు. దీన్నుండి బయటపడేందుకు అమరావతి కేసులను త్వరగా విచారించాలని ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. ఈ నెలలోనే దీనిపై స్పష్టత వస్తే వెంటనే కార్యాచరణ ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయనుంది. విశాఖలో రాజధాని ఏర్పాటు అంశంపై కేంద్రం కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈస్టన్ర్‌నేవల్ కమాండ్ ఇక్కడే ఉండటం, భద్రతాపరంగానూ కీలకమైన ప్రాంతం, పెట్రోలియం నిల్వలు, రక్షణ విభాగ నిల్వలకు విశాఖ తీరం కేంద్రం కావడంతో అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే వచ్చే సమస్యలపై కేంద్రం అభ్యంతరం పెట్టినట్లు తెలిసింది. దీనిపైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరుపుతోంది. త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
