ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
వరంగల్ వాయిస్, కరీమాబాద్ : ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్బంగా తెలంగాణ ఆటో, ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ, జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం జెండా ఆవిష్కరించి ఆటో డ్రైవర్లనుద్దేశించి మాట్లాడారు. ఉద్యమనేత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అన్ని విధాల అండగా ఉంటున్నదన్నారు. భవిష్యత్‌లో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నగరంలోని అన్ని ఆటో అడ్డాలలో మౌళిక వసతుల కోసం కృషి చేస్తానన్నారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతున్నదన్నారు. లైసెన్స్, బ్యాడ్జ్ కలిగి ఉన్న ఆటో డ్రైవర్లు ప్రమాద వశాత్తు మరణిస్తే రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం అభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గందె కల్పన, యూనియన్ అధ్యక్షుడు వీరాస్వామి, జనరల్ సెక్రటరీ సుధాకర్, ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
