మండలి ఫలితాలు విశ్లేషిస్తామని వెల్లడి వరంగల్ వాయిస్,విజయవాడ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంపై ఏపీ మంత్రులు ఆర్కే రోజా, కాకాణి గోవర్థన్ రెడ్డి స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర మంత్రులు ఘాటు విమర్శలు చేశారు. టీడీపీది అనైతిక విజయమని వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కృష్ణా జిల్లాలో మంత్రులు రోజా, కాకాణి పర్యటించారు. ఈ సందర్భంగా గన్నవరంలోని ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆవరణలో డాక్టర్ వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు విూడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీకి రానన్న చంద్రబాబు ఎందుకు వచ్చారని మంత్రి రోజా ప్రశ్నించారు. అధికారంలో ఉండగా 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు (ªుఆఖ అఠతి।ªబి) 23 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని అన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీకి మిగులుతారని విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఎమ్మెల్యేల భవిష్యత్ ఏంటో త్వరలో తేలుతుందని రోజా పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీది అనైతిక విజయమని మంత్రి కాకాణి అన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు అనుసరించిన తీరుతో ఆయన కుట్రలు మరోసారి బయటపడ్డాయని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేసిన వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. క్రాస్ ఓటింగ్‌పై అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామ న్నారు. ఈ ఫలితాలపై ఆలోచన చేయాల్సిన అవసరం లేదని అన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు.. ఇవే చివరి విజయోత్సవాలని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలప్పుడు టీడీపీ విషయం బయటపడుతుందని కాకాణి పేర్కొన్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీమోహన్ , రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ నాగిరెడ్డి, సంస్థ ఛైర్ పర్సన్ హేమసుశ్మిత, వైసీపీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.