సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ భూపాల్
వరంగల్ వాయిస్, హనుమకొండ : షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాల జీవోలను అమలు చేయాలని అసంఘటిత రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డులను ఏర్పాటు చేయాలని జిల్లా లేబర్ అధికారి కార్యాలయం ముందు వివిధ రంగాల కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ భూపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాల గడుస్తున్న నేటికీ 73 షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాల జీవోలను అమలు చేయడం లేదని, ఈ కారణంగా కోట్లాది రూపాయలు కార్మికులు నష్టపోతున్నారని, రాష్ట్ర కార్మిక శాఖ కనీస వేతనాలు అమలు చేయాలని ముఖ్యమంత్రికి ఫైలు పంపినప్పటికీ స్వయంగా ముఖ్యమంత్రి కనీస వేతనాల అమలును నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. కనీస వేతనాలు చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు మూడుసార్లు సవరణ జరగాల్సి ఉండగా కార్మిక సంఘాల ఒత్తిడితో హైకోర్టు ఆదేశం మేరకు వేతనాల సలహా మండలి 2014లో ఏర్పాటు చేసింది. కాల పరిమితి ముగిసిన జీవోలను సవరించాలని బోర్డు ప్రతిపాదనలు పంపినప్పటికీ 2015 నుంచి నేటికీ ప్రభుత్వం ఆ ప్రతిపాదనన్ని తొక్కి పట్టి కార్మికులకు అన్యాయం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో అసంఘటిత రంగంలో ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్, హమాలీ, వ్యవసాయేతర కార్మికులు లక్షలాది మంది ఉత్పత్తిలో భాగమై పనిచేస్తున్న వారికి వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేయకుండా, చట్టబద్ధత కల్పించకుండా కార్మికుల శ్రమను రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుందని వీరందరికీ ఆయా రంగాలలో ప్రభుత్వం తరఫున గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 1983 ఆల్ షాపు వర్కర్స్ చట్టం ఏర్పడినప్పటికీ కార్మికులకు యాజమాన్య గుర్తింపు ఎస్ ఫాం ఉంటేనే కార్మిక సంక్షేమ మండలి పథకాలు నామమాత్రంగా అమలవుతున్న పరిస్థితి నుంచి షరతులు లేనటువంటి నమోదును చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 1996 కేంద్ర భవన నిర్మాణ కార్మికుల చట్టాన్ని రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయాలని చట్టంలోనే అన్ని సంక్షేమ పథకాలు కార్మికులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయాలన్నారు. అసెంబ్లీ సాక్షిగా నిర్మాణ కార్మికులకు లక్ష మోటార్ సైకిల్ ఇస్తానన్న ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకోవాలని, ఈ రంగంలో అవినీతి అక్రమాలను దళారీ వ్యవస్థను అరికట్టాలని, గుర్తింపు కార్మిక సంఘాలతో స్కూటీ కమిటీ, అడ్వైజరీ కమిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ముక్కెర రామస్వామి, జిల్లా కన్వీనర్ అనంతగిరి రవి, ఉపాధ్యక్షుడు ఎండీ మహబూబ్ పాషా, అక్కినపల్లి యాదగిరి, బోల కొమురయ్య, ఎండీ సలీం, భిక్షపతి, వంశీ, ప్రభాకర్, ఎండీ బేగం, జయరాం, మధు, గై. రాము, రాజు, తదితరులు పాల్గొన్నారు.