- భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
వరంగల్ వాయిస్, రేగొండ : జూన్ 10లోపు అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులను పూర్తి చేయాలని జయశంకర్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. శనివారం మండలంలోని బాగిర్తిపేట, గూడెప్పల్లి, మడత పల్లి, రంగయ్యపల్లి, గోరి కొత్తపల్లి మండలంలోని రూపిరెడ్డిపల్లి, చిన్న కోడెపాక గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాధమిక, ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతిని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకునేందుకు అనువుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పనకు మరమ్మత్తు పనులు చేపట్టినట్లు తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ఒక్క పని పెండింగ్ లేకుండా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మండలంలో 26 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు రూ. కోటి 17 లక్షలతో పనులు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి పాఠశాలల్లో కావలసిన మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలో విద్యుత్, మంచినీరు, మరుగుదొడ్లు, హ్యాండ్ వాష్, ప్లాట్ ఫామ్ వంటి మౌలిక వసతులుతో పాటు చిన్న, చిన్న మరమ్మత్తు పనులు సైతం పూర్తి చేయాలన్నారు.
బాగిర్థిపేట జిల్లా పరిషత్ పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో మరమ్మత్తులకు రూ.4 లక్షల 20 వేలు, గూడెప్పల్లి ప్రాథమిక పాఠశాలకు రూ.8 లక్షల 50 వేలు, మడతపల్లి జిల్లా పరిషత్ పాఠశాల, ప్రాథమిక పాఠశాలకు రూ.3 లక్షల 95 వేలు, రంగయ్యపల్లి జిల్లా పరిషత్ పాఠశాలకు రూ.6 లక్షల 55 వేలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. భాగిర్తి పేట గ్రామంలో స్రైనేజి మోరిలు పగిలి పోవడం వల్ల రవాణాకు ఇబ్బంది కలుగుతుందని, నూతన మోరిలు నిర్మించాలని గ్రామస్థులు చేసిన విజ్ఞప్తి మేరకు పరిశీలించిన కలెక్టర్ మోరిలు నిర్మాణానికి ప్రతిపాదనలు అందచేయాలని ఎంపీడీఓకు సూచించారు. అలాగే గోరికొత్తపల్లి మండలంలోని రూపిరెడ్డి పల్లి ప్రైమరీ పాఠశాలకు రూ.3.95 లక్షలు, చిన్న కోడేపాక ప్రైమరీ పాఠశాలకు రూ.3.70.లక్షలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.10.70 లక్షలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. పాఠశాలల్లో మైదానాలను ఉపాధి హామీ పథకం నిధులతో చదును చేపట్టాలని అన్నారు. రానున్న హరితహారంలో పండ్ల మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. చిన్నకోడేపాక పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్ వాడీ భవనం మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శామ్యూల్, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఎంపీఓ రామ్ ప్రసాదరావు, టీజీఈడబ్ల్యూఐడీసీ ఏఈ రాజు, వీఓలు సుజాత, లావణ్య, సుమలత, శోభ, స్వప్న, రమాదేవి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
