Warangalvoice

srisri

అభ్యుదయ యుగానికి నాంది ప్రస్థాపకుడు

  • శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ జయంతి ఏప్రిల్ 30న

వరంగల్ వాయిస్, ప్రత్యేకం: జీవితాన్ని కవిత్వంలోనూ వడబోస్తూ, తెగిన గాలి పటంలా గడిపానని శ్రీ శ్రీ అనేవారు. 1936లో ‘వీణ’ పత్రిక సంపాదక వర్గంలో కొంత కాలం పనిచేశారు. 1938లో ఆంధ్రప్రభలో సహాయ సంపాదకునిగా పనిచేశారు. శ్రీ శ్రీ తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా, కవితా వ్యాసంగం మాత్రం వదలలేదు. ఆనాటి రోజుల్లో అధికంగా వాడుకలో ఉన్న సంప్రదాయ, భావ కవిత ధోరణులు ఆకర్షించిన వాడైనా, కొన్ని కొత్త ధోరణులు తన కవితలో శ్రీ శ్రీ ప్రదర్శించే వారని, ప్రముఖ కవులు మల్లంపల్లి సోమశేఖర శర్మ తదితరులు పేర్కొన్నారు. శ్రీ శ్రీ రాసిన ‘మహాప్రస్థానం’ అఖిలాంధ్ర కీర్తి తెచ్చి పెట్టింది. ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఒక కొత్త మలుపును సృష్టించిన నవ్య సాహిత్య పరిషత్తును 1936లో ప్రారంభించడంలో శ్రీ శ్రీ కూడా ప్రముఖ పాత్ర వహించాడు. అయితే 1937లో తన ఆప్తమిత్రుడు కొంపెల్లి జనార్ధనరావు మరణించడంతో తీవ్ర విచారన్ని, దుఃఖాన్ని అనుభవించానని ఆయన రాశారు. చిన్నతనంలోనే తల్లి, సవతి తల్లి, ఆప్తమిత్రుడు, భార్య ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో జీవితంలో ఏదో తీర్చలేని వెలితిలో బాధకు గురైనాడాయన. 1942లో ఆకాశవాణిలో, 1943 ప్రాంతంలో సైన్యంలో, ఆ తర్వాత నాటక సమాజాలలో పనిచేశారు. అభ్యుదయ రచయితల సంఘం స్థాపనలో, విప్లవ రచయితల సంఘంలో శ్రీ శ్రీ ప్రముఖ పాత్ర వహించారు. 1948లో సినీ రంగంలో ప్రవేశించారు. దీంతో ఆర్థికంగా కొంత నిలదొక్కుకున్నాడాయన. ‘చెవిలోపువ్వు’లాంటి చలన చిత్రాల నిర్మాణం చేపట్టాడు. 1953లో మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా, 1957లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడిగా పనిచేశారు. శ్రీ శ్రీ పూర్తి పేరు శ్రీ రంగం శ్రీనివాసరావు. చిన్న తనంలోనే ‘స్వశక్తి’ అనే పత్రికకు తను రాసిన పద్యాలు పంపితే ప్రచురితమయ్యాయి. గోకులాలు, వీరసింహం, విజయ సింహం లాంటి రచనలు 17 సంవత్సరాలైనా నిండక మునుపే రాశారు. నాటి రోజుల్లో తనపై ప్రభావం చూపిన ఆంధ్ర కవులు శ్రీరాయప్రోలు, శ్రీ విశ్వనాథ, శ్రీదేవులపల్లిగా శ్రీ శ్రీ పేర్కొన్నారు. శ్రీ శ్రీ తెలుగులో వినూత్న కవితా ప్రయోగశీలిగా, అభ్యుదయ కవిత మార్గ ప్రవర్తకుడిగా, భావ కవిత యుగంలో, భాషలో, వస్తువులో, ఛందస్సులో, క్రొత్త పోకడలను సృష్టించిన సత్కవితగా, తెలుగు సాహితీ చిత్ర పటంలో విశేష ఖ్యాతి నార్జించాడు. ఆయన ‘మహాప్రస్థానం’ ‘మరో ప్రపంచం’ ‘చరమరాత్రి’, ‘ఖడ్గసృష్టి’, ‘అనంతం’ లాంటి రచనలు శ్రీ శ్రీ ప్రతిభకు పాండిత్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఉస్మానియాలో నామమాత్రంగా తెలుగు శాఖను ఏర్పాటు చేశారు. దానికి తొలి ఆచార్యలు ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా’ దేయ రచయిత, ప్రఖ్యాత భావ కవి రాయప్రోలు సుబ్బారావు. నిజాం కొలువులో రాయప్రోలు హోర్యానీ ధరించి కొలుపుకు వెళ్లేవారు. తెలుగును ధ్వంసం చేయపూనుకున్న నిజాం కొలువులో దేశభక్తి గేయకవి రాయప్రోలు. ఇది వింతయే కాని ఇది వాస్తవం. రాయప్రోలు వారు నిజాంను ప్రశంసిస్తూ రచించిన జాడలు లేవు. బ్రిటిషాంధ్ర నుంచి నిజాం కొలువులో చేరిన కురుగంటి సీతారామయ్య ‘ఆదర్శప్రభువు’ అనే గ్రంథం రచించి ప్రభువు వారి మన్ననలు పొందారు. ఈ పుస్తకానికి రాయప్రోలు వారు పీఠిక వ్రాశారు. ఇటువంటి గ్రంథాల ప్రచురణకు ఆంధ్రసాహిత్య పరిషత్తును స్థాపించారు. ఈ పుస్తకం తెనాలిలో అచ్చయింది. ఆ రోజుల్లో తెలుగు వారి తరఫున నిజామును పొగడడానికి రప్పించిన ముగ్గురికి రా.కా.సి. అని పేరు పెట్టారు. స్థానిక తెలుగులు, రాయప్రోలు, కాసింఖాను, సీతారామ భట్టాచార్య, శ్రీరంగం శ్రీనివాసరావు గారు కూడా కొంత కాలం నిజాం కొలువు చేశారని చెప్పకుంటారని, జీవన యానంలో డాక్టర్ దాశరథి రంగాచార్య పొందుపరిచారు. ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో అభ్యుదయ యుగానికి నాందీ ప్రస్తావన చేసిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీ శ్రీ కవిత్వంలో నూతన శకానికి ఆయన ఆధ్యుడు ఆంధ్రదేశంలో నక్సలైట్లు సాయుధ పోరాటం శ్రీకాకుళంలో ప్రారంభం అయింది. సమాజాన్ని సహించలేక ఎదిరించలేక తికమకలవుతున్న యువతకు ఒక మార్గం కనిపించింది. దిగంబర కవులు సహితం సమాజం తిట్లకు అలవాటు పడిందని గ్రహించారు. సమాజాన్ని సాపు చేయడానికి బుల్లెట్ కావాలనుకున్నారు. అలా ఉండగా హైదరాబాదులో శ్రీ శ్రీ ఒక సంస్థ సన్మానించడానికి 4-7-1970న జూబ్లీ హాలులో సభ ఏర్పాటు చేశారు. అందుకు అంగీకరించి హైదరాబాద్ వచ్చారు. దిగంబర కవుల్లో కొందరు మరికొందరు సాయుధ విప్లవం మీద విశ్వాసం ఉన్న యువకులకు శ్రీ శ్రీ వంటి విప్లవ కవి ఒక సంస్థ సన్మానం సంపాదించడం బాగనిపించలేదు. వారు ఆ రాత్రి శ్రీ శ్రీని కలిశారు. వారి అధ్యక్షతన ‘విప్లవ రచయితల సంఘం’ స్థాపించారు. వారు తుపాకి గొట్టం నుంచి విప్లవం వస్తుందని విశ్వసించారు. అప్పటికి తెలంగాణమునకు పాకిన నక్సలైటు సాయుధ పోరాటానికి సుమారు అనుబంధ సంస్థ అయింది విరసం. విరసం యువకులను మేధావులను విశేషంగా ఆకర్షించింది. వారి విస్తృతం అయిన కార్యక్రమాలు నిర్వహించారు. రచన అంటే విప్లవ రచన అనేంత స్థాయికి పాకింది విరసం. విరసం వారు రచయితలు విప్లవం తేగలరని నమ్మారు. ఎంతటి విప్లవంలోనూ రచయితల పాత్ర ప్రజలను విప్లవోన్ముఖం చేయడం మాత్రమేనని విరసం ప్రచురించిన కొన్ని పుస్తకాలను ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వం కొందరు విరసం రచయితలను అరెస్టు చేసింది. శ్రీరంగం శ్రీనివాసరావు 1910 ఏప్రిల్ 30న విశాఖపట్నంలో ఆయన జన్మించారు. తల్లి శ్రీమతి అప్పికొండ, తండ్రి శ్రీరంగం వేంకట రమణయ్య. తండ్రిగారిది అధ్యాపక వృత్తి. శ్రీ శ్రీ మద్రాసు క్రిష్టియన్ కళాశాలలో 1931లో బి.ఏ. డిగ్రీ పూర్తి చేసి నిరుద్యోగి పట్టభద్రుడిగా రోజులు గడవక బీదరికం అనుభవించారు. 1970లో కాకినాడలో నిర్వహించిన శ్రీ శ్రీ షష్టిపూర్తి సందర్భంగా ఆయన రచనలన్నీ ఆరు సంపుటాలుగా ప్రచురించారు. సమసమాజ సంస్థాపక ప్రవక్తగా కీర్తి సాధించి శ్రీ శ్రీ అనారోగ్యంతో 15 జూన్ 1983లో మృతి చెందినా సాహితీ జగత్తులో ఆయన రచనలు అజరామరంగా దర్శనమిస్తున్నాయి. (1910‌-1983)

kolanupaka_kumaraswamy
Kolanupaka Kumaraswamy

కొలనుపాక కుమారస్వామి, వరంగల్
మొబైల్: 99963720669

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *