- 8ఏండ్లలోనే అద్భుత తెలంగాణ
- ఉద్యమ నేతే సీఎం కావడం రాష్ట్రానికి వరం
- కేసీఆర్ నేతృత్వంలో దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రం
- అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణకు ఎదురులేదు
- సంపద పెంచు, అందరికీ
- పంచు అనే పద్ధతిలో పాలన
- వరంగల్ సమగ్ర అభ్యున్నతికి ఎన్నో పథకాలు
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
దేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రం ఊహకు కూడా అందని ఆదర్శవంతమైన పథకాల అమలుతో తెలంగాణ అగ్రగామిగా దూసుకెళుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఖిలా వరంగల్ కోటలో జెండా ఆవిష్కరించి వేడుకల్లో మాట్లాడారు.. రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి, సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా సమర్థవంతంగా పరిపాలన సాగుతోందన్నారు. రాష్ట్రం ఏర్పడిన 8ఏండ్లలోనే అద్భుత విజయాలు సాధించడం మనందరికీ గర్వకారణమన్నారు. వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
-వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి
వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేవలం 8 ఏండ్లే అయినా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అద్భుత విజయాలు సాధించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరులకు నివాళులర్పించి ఖిలా వరంగల్ కోట లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసు ల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత ప్రజలనుద్దేశించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. నీళ్ళు, నిధులు, నియామకాలు నిజమవుతున్న ఈ సందర్భమే అమరులకు నిజమైన నివాళిగా భావిస్తున్నానన్నారు. తెలంగాణ ప్రజల 60 ఏండ్ల కల… కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వం… సకల జనుల, 14 ఏండ్ల శాంతియుత పోరాటం ద్వారా తెలంగాణ సాధించుకున్నామన్నారు. ఉద్యమ నేతే సీఎం కావడం రాష్ట్రానికి వరంగా మారిందని, ఆయన ముందుచూపుతో దేశంలో ఎక్కడా లేని అద్భుత పథకాలను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా చేపట్టిన ప్రణాళికలన్నీ మంచి ఫలితాలిస్తున్నాయన్నారు. నిరుపేద విద్యార్దులకు నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వం ‘‘మన ఊరు – మన బడి ’’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, 3 ఏళ్ళల్లో 3 విడతల్లో జిల్లాలోని 645 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ది జరుగుతున్నదన్నారు. బాలికా విద్యను బలోపేతం చేసేందుకు జిల్లాలో 10 కె.జి.బి.వి లను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్యం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. జిల్లాలో 52 ఆరోగ్య ఉపకేంద్రాల భవన నిర్మాణం కోసం ఒక్కో ఉపకేంద్రానికి రూ.16 లక్షల చొప్పున నిధులు మంజూరీ అయి పనులు ప్రారంభమైనవన్నారు. 6వేల 698 ప్రసవాలు ప్రభుత్వ దవాఖానాలలో 5వేల 105 ప్రైవేటు దవాఖానాలలో మొత్తం 11వేల 803 ప్రసవాలు జరిగినవన్నారు. ఇందులో 7వేల 345 మందికి కేసీఆర్ కిట్లు పంపిణీ చేశామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ ఎంజీఎంకి బడ్జెట్ లోనే 100 కోట్లు కేటాయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు.. 15వందలకు పడకలను పెంచినామన్నారు. ప్రపంచ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించడానికి 11 వందల కోట్లతో 24 అంతస్తులు, 2వేల పడకలతో కొత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణంలో ఉందన్నారు. రైతుబంధు ద్వారా జిల్లాలో 2021-22 ఏడాది వానాకాలానికి 1 లక్షా 38వేల 306 మంది రైతులకు 133 కోట్ల 8 లక్షల రూపాయలను, 2021-22 యాసంగికి 1 లక్షా 42 వేల 15 మంది రైతులకు 133 కోట్ల 71 లక్షల రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశామన్నారు. 2021-22 ఏడాదికి 306 మంది రైతు కుటుంబాలకు రైతు బీమా కింద మొత్తం 15 కోట్ల 30 లక్షల రూపాయలను అంద చేశామన్నారు. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా 24 గంటలపాటు కోతలు లేని నాణ్యమైన కరెంటుని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. జిల్లాలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 19 కోట్ల 9 లక్షల వ్యయంతో 2 వేల 150 తుప్పు పట్టిన ఇనుప స్తంభాల స్థానంలో కొత్తవి వేశామన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధితోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధ్యమవుతుందని దేశంలో ఎక్కడా లేని విధంగా పల్లె ప్రగతి అనే వినూత్న గ్రామీణ వికాస కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మొత్తం 323 గ్రామ పంచాయితీలలో 923 కి.మీ మేర రోడ్లను, 351 కి.మీ మేర మురుగు నీటి కాలువలను నిర్మించామన్నారు. వరంగల్ మహానగర వ్యాప్తంగా పట్టణ ప్రగతిలో మొదటి విడతలో 22 క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం సేకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2021-22 యాసంగిలో జిల్లాలో ఇప్పటి వరకు 11వేల 920 మంది రైతుల నుంచి 51వేల 954 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు. ఏ ఆసరా లేని నిరుపేదలకు ప్రభుత్వమే ఆసరా అవుతున్నది. గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం ద్వారా జిల్లాలో ప్రతి నెలా 1 లక్షా 2 వేల 441 మందికి పెన్షన్‌లు ఇస్తున్నామన్నారు. దళితులలో ఆర్థిక సాధికారత కేసీఆర్ లక్ష్యమని, ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 301 దళిత కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు. కాగా వచ్చే ఏడాది నియోజకవర్గానికి 150 కోట్ల విలువైన 15 వందల యూనిట్లు ఇవ్వనున్నామన్నారు. కాకతీయ టెక్స్ టైల్ పార్క్ లో దాదాపు 4వేల 600 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 15వేల మంది ఉపాధి పొందనున్నారన్నారు. వరంగల్ తెలంగాణ సాంస్కృతిక రాజధాని అని, లక్నేపల్లి గ్రామంలో పీవీ నర్సింహారావు పేరుతో గ్రామీణ విజ్ఞాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి రమేశ్, కలెక్టర్ బి. గోపి, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, జడ్పీ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పోరేటర్లు,ఇతర ప్రతినిదులు పాల్గొన్నారు.
మిన్నంటిన సంబురం
వరంగల్ వాయిస్, మహబూబాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకావిష్కరణ గావించిన అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. ప్రజా సేవలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా అధికారులకు అవార్డులు అందజేశారు. దళిత బంధు లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో వివిధ ప్రభుత్వ శాఖలవారు, ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మహబూబాబాద్ జడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, కలెక్టర్ శశాంక,ఆడిషన్ కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ శరత్ చంద్ర పవర్, అడిషనల్ ఎస్పీ,యోగేష్ గౌతమ్, కురవి జడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
క్రీడా ప్రాంగణం ప్రారంభం
జిల్లా కేంద్రంలోని కొత్త బజార్ వార్డు నెంబర్ 24, ఇంద్రానగర్ కాలనీలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనీ యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు, యువత శారీరకంగా, మానసిక ఉల్లాసంతో దృఢంగా ఎదగడానికి ముఖ్యమంత్రి తెలంగాణ క్రీడా ప్రాంగణాల ను ఏర్పాటు చేయాలని సూచించారని, ప్రతి వార్డులో, గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్రీడా ప్రాంగణంలో మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజా ప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీ , అదనపు కలెక్టర్ లతో కలిసి వాలీ బాల్ ఆడారు.








