- భార్యను హత్య చేసిన భర్త
- నిందితుడి ఇంటికి నిప్పుపెట్టిన బంధువులు
- మరిపెడ మండలం అనకట్ట తండాలో విషాదం
వరంగల్, వాయిస్, డోర్నకల్: ‘‘అమ్మ… లే అమ్మ… నాన్న వెళ్లిపోయా డు… లేవమ్మా’’ అంటూ చనిపోయిన వాళ్ల అమ్మను లేపే ప్రయత్నం చేస్తున్న చిన్నారులను వారించ టం.. సముదాయిం చటం ఎవ్వరి వల్ల కాలేదు. తండ్రి అవేశం వల్ల తమ తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తెలియని చిన్నారుల పరిస్థితి చూసి తండావాసులు కన్నీరుపె ట్టారు. మానుకోట జిల్లాలో ఉదయం ఓ మహిళ హత్య సంచలనం రేపింది. వివరాలిలా ఉన్నాయి.. మరిపెడ మండలం తానంచర్ల పరిధిలోని ఆనకట్ట తండాకు చెందిన బానోత్ రవీందర్‌కు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని నారియ తండాకు చెందిన బానోత్ మమత(29) కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఏడాది పాటు సజావుగా సాగిన వీరి కాపురానికి గుర్తుగా నాలుగేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె జన్మించారు. ఆ తర్వాత భార్యపై అనుమానం గొడవలకు దారితీసింది. పలుమార్లు భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు జరుగుతు ఉండగా పెద్దమనుషులు పలుమార్లు పంచాయితీ చేశారు. కాగా అనుమానంతో రగిలిపోతున్న రవీందర్ సోమవారం రాత్రి నిద్రిస్తున్న భార్యను గొడ్డలితో కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు. జరిగిన విషయాన్ని పిల్లల ద్వారా తెలుసుకున్న తండావాసులు బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకుని, మమత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో కుటుంబసభ్యులు, బంధువులు అడ్డుకున్నారు. తాము రాకుండానే మృతదేహం తరలిస్తున్నారంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో మృతదేహాన్ని తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. మహిళ మృతదేహం చూడగానే ఆగ్రహానికి గురైన వారు రవీందర్ ఇంటిని ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. పోలీసులు పరిస్థితి అదుపు చేసేందుకు లాఠీలు రaుళిపించగా తండాలో ఉద్రిక్త వాతవరణం నెలకొంది. అనంతరం డీఎస్పీ రఘు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి గొడవకు కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బందోబస్తుతో మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా నిందితుడు అజ్మీర తండా ఉప సర్పంచ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.