- ఎక్కువ మొత్తంలో మొక్కలు నాటేలా రైతులకు అవగాహన
- ఒకేసారి పత్తి సేకరణకు అనుకూలం
- కూలీల వినియోగం అంతంత మాత్రమే
- పెట్టుబడి వ్యయం తగ్గి..
- అధిక దిగుబడికి అవకాశాలు అధికం
- నష్టాలు తగ్గి లాభాల బాట పట్టనున్న రైతులు
వరంగల్ వాయిస్, భూపాలపల్లి: జయశంకర్ జిల్లా రేగొండ మండలంలో రైతులు ఖరీఫ్ సీజన్లో ఏటా తెల్ల బంగారం సాగు చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రకృతి కల్పిస్తున్న ప్రతికూల పరిస్థితులు, తెగుళ్లు, చీడ పీడల వల్ల పెట్టుబడి పెరిగి, పంట దిగుబడి తగ్గి పోయి రైతులు నష్టాల పాలవుతున్నారు. ఆ నష్టాలను పూడ్చుకుని, లాభాల బాట పట్టడానికి మార్గం కానరాక దిక్కుతోచని పరిస్థితులను చవిచూస్తున్నారు. ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడటానికి ప్రత్యామ్నాయంగా ఈ దఫా పత్తి పంటలో వినూత్న ప్రయోగానికి యత్నాలు జరుగుతున్నాయి. సాంప్రదాయ పద్ధతికి భిన్నంగా అధిక సాంద్రతతో పత్తిని పండిరచడానికి రైతాంగాన్ని ఆ దిశగా సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడక్కడ కొంతమంది రైతులు అధిక సాంద్రతతో పత్తి పండిస్తుండగా ఈ దఫా సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మరో పక్షం రోజుల వ్యవధిలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ మేరకు పత్తిని అధిక సాంద్రతతో పండిరచడం వల్ల వచ్చే దిగుబడి కలిగే ప్రయోజనాలను రేగొండ మండల వ్యవసాయ అధికారి పెద్ది వాసుదేవ రెడ్డి సాగు వివరాలు, కలిగే లాభాలు తదితర అంశాలు ఆయన మాటల్లోనే..
అత్యల్ప విస్తీర్ణంలో..
పత్తిలో సాంప్రదాయంగా వస్తున్న సాధారణ పద్ధతి కాకుండా అత్యల్ప విస్తీర్ణంలో అధిక సంఖ్యలో విత్త నాలు నాటి పంట మొత్తాన్ని ఒకేసారి ఏరుకునే విధంగా నూతన విధానం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు అవలంబిస్తున్న విధానంలో ఎకరానికి 7వేల నుంచి 8వేల పత్తి మొక్కలు ఉంటే, అధిక సాంద్రత పద్ధతిలో దాదాపు 25 వేల వరకు మొక్కలు ఉండే అవకాశం ఉంది. సాంప్రదాయ పద్ధతికి భిన్నంగా వరుసల మధ్య దూరాన్ని 60 నుంచి 90 సెంటీ మీటర్లు ఉంచి మొక్కల మధ్య దూరాన్ని దాదాపు 10 నుంచి 20 సెంటీ మీటర్లుగా చేయడం వల్ల ఒక మీటరు పొడవుకి 8 నుంచి 10 మొక్కలు వచ్చేలా చూసుకుని పంట సాంద్రతను పెంచుకోవడం జరుగుతుంది.
అనువైన రకాలు..
అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంట సాగు చేయడానికి అనువైన రకాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించింది. ఇందులో ఏబీడీ 39, ఎన్.సీ.ఎస్ 2778 ముఖ్యమైనవి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ప్రైవేట్ హైబ్రిడ్ విత్తనాలను (విన్నర్, సిరి, సూరత్, ‘రాజత్ పీవీకే -081) రకాలను నూతన యాజమాన్య పద్ధతులు ఉపయోగించి విత్తుకోవచ్చు.
ఒకేసారి ఏరటం ఎంతో సులువు…
సాధారణంగా పత్తిపంటలో పత్తి చేతికి వచ్చిన తర్వాత 2 నుంచి 3 సార్లు పత్తి ఏరడం జరుగుతుంది. ఇందుకు కూలీల అవసరం ఎంతగానో ఉంటుంది. పత్తి సేకరించే క్రమంలో అకాల వర్షాలు వస్తే పంట నష్ట పోవడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. అధిక సాంద్రతలో సాగు చేసిన పత్తి పంట మొత్తాన్ని ఒకేసారి సేకరించుకోవచ్చు. ఇందుకు కూలీల అవసరం తగ్గి, పంట కోసం అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. పంట మొత్తం ఒకేసారి చేతికి రావడానికి మేపిక్వాట్ క్లోరైడ్ అనే రసాయనాన్ని పత్తి విత్తుకున్న 40 నుంచి 60రోజుల్లో ఒకసారి, 70 నుంచి 80రోజుల్లో మరోదఫా పిచికారీ చేయాలి. పూత దశలో లీటరు నీటికి 1.5 మి.లీ. రసాయనాన్ని వినియోగించాలి. ఈ విధంగా చేయడం వల్ల పంట సరళిని ఒకేసారి ఏరుకోవడానికి వీలు కలుగు తుంది. తద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చు. ఒకేసారి పంట చేతికి అందడం వల్ల నవంబర్ , డిసెంబర్ నెలలో పత్తి సేకరణ చేసుకోవచ్చు. తద్వారా గులాబీ రంగు పురుగు ఉధృతి తగ్గడంతో పాటు సత్వరంగా పత్తి పంటను ముగించవచ్చు. దీంతో రెండో పంటగా పప్పుధాన్యాలు, ఆరుతడి పంటలు సాగు చేసుకోవడానికి అనుకూలత ఏర్పడుతుంది. అధిక సాంద్రతతో పత్తి సాగు చేయడం వల్ల ఎకరానికి 7 నుంచి 8క్వింటాళ్లు పండే పత్తి పంటను 13నుంచి గరిష్టంగా 15 క్వింటాళ్ల దిగుబడిని పెంచు కునే అవకాశాలు ఉంటాయి. పత్తి సాగుకు సిద్ధ పడుతున్న రైతులు కొత్తపద్ధతిని అనుసరించి లాభాలు గడిరచాలి.