- దేశ రక్షణకు సైనికులు..
అటవీ రక్షణకు ఉద్యోగులు ప్రాణాలర్పిస్తున్నారు - కొనియాడిన మంత్రి సురేఖ
- రేపు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం
వరంగల్ వాయిస్, వరంగల్ : దేశ రక్షణకు సరిహద్దుల్లో శత్రుమూకలతో పోరాడుతూ సైనికులు ప్రాణాలు అర్పిస్తుంటే, దేశ సహజవనరులైన అడవుల సంరక్షణకై పోరాటం చేస్తూ అటవీ ఉద్యోగులు ప్రాణాలు అర్పిస్తున్నారని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సెప్టెంబర్ 11 సందర్భంగా అడవుల సంరక్షణకై ప్రాణాలు అర్పించిన అమరవీరులు త్యాగాలను స్మరించుకుంటూ, అటవీ సంపద సంరక్షణకు, వన్యప్రాణుల పరిరక్షణకు అటవీ ఉద్యోగులు చేస్తున్న కృషిని మంత్రి కొండా సురేఖ ప్రశంసించారు. ‘మనిషి జీవితం అడవుల నుంచే ఆరంభమైంది. మానవ పరిణామక్రమానికి అడవులు సాక్షిభూతంగా నిలిచాయి. మనిషి ఆదిమ మానవుడి నుంచి ఆధునిక మానవుడిగా రూపాంతరం చెందే క్రమంలో అడవులే ఆలవాలమయ్యాయి. తల్లిగా చేరదీసిన అడవులతో మనిషికి ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. ఆ అనుబంధమే పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమించేలా వారిని ప్రోత్సహించింది’ అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
ప్రకృతి ప్రేమికులు అడవుల సంరక్షణకు తమ ప్రాణాలను అర్పించిన సంఘటనలెన్నో చరిత్రలో నమోదయ్యాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. భారతదేశ చరిత్రలో 18వ శతాబ్ధం ఆరంభంలో ఖెజార్లి గ్రామంలో చెట్ల నరికివేతను నిరసిస్తూ, జోధ్ పూర్ రాజుకు వ్యతిరేకంగా బిష్ణోయి తెగకు చెందిన వ్యక్తుల తిరుగుబాటుతో మొదలైన ఉద్యమం తర్వాత కాలంలో సైలెంట్ వ్యాలీ ఉద్యమం, అప్పికో ఉద్యమం, జంగిల్ బచావో ఆందోళన్, చిప్కో ఉద్యమం వంటి అటవీ సంరక్షణ ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిందని మంత్రి సురేఖ పేర్కొన్నారు. నేటికీ ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ప్రకృతి ప్రేమికులు అటవీ సంపద రక్షణకు, అడవుల పునరుద్ధరణకు గొప్ప సంకల్పంతో పోరాడుతున్నారని మంత్రి సురేఖ కీర్తించారు.
మానవ మనుగడకు అడవుల ప్రాధాన్యతను గుర్తించిన వ్యవస్థలు అడవులను ప్రభుత్వపరంగా కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించడంతోనే అటవీశాఖకు బీజం పడిందని మంత్రి తెలిపారు. అడవుల సంరక్షణలో భాగంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది అటవీశాఖ ఉద్యోగులు, సిబ్బంది తమ ప్రాణాలను అర్పించారని అన్నారు. రాష్ట్రంలో విధి నిర్వహణలో భాగంగా 22 మంది అటవీశాఖ సిబ్బంది ప్రాణాలు కోల్పోడం అత్యంత బాధాకరమని మంత్రి అన్నారు. అడవుల సంరక్షణ కోసం వారు చేసిన త్యాగాలు వెలకట్టలేనివని మంత్రి సురేఖ తెలిపారు. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా కార్యాచరణ అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సఫలమైందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమం ద్వారా రాష్ట్ర అటవీ సంపదను 24 శాతం నుంచి 33 శాతానికి పెంచే మహా యజ్ఞంలో భాగస్వాములైన అటవీ ఉద్యోగులు, సిబ్బంది తెలంగాణ రాష్ట్రాన్ని బృందావనంగా మార్చే దిశగా కార్యదక్షతతో పనిచేయాలని ఆకాంక్షించారు. పచ్చదనం పరిరక్షణకు, వన్యప్రాణుల సంరక్షణకు అటవీ అమరవీరుల ప్రేరణతో ఉద్యమించాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అటవీ శాఖను బలోపేతం చేసే దిశగా అవసరమైన ఉద్యోగులు, సిబ్బంది నియామకం పై కసరత్తు చేస్తున్నదని మంత్రి తెలిపారు. అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా, అడవుల నరికివేతకు అడ్డుకునే దిశగా పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు అటవీశాఖను సర్వసన్నద్ధం చేసే దిశగా అటవీశాఖ కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.