వరంగల్ వాయిస్, రేగొండ : ఉమ్మడి రేగొండ, గోరికొత్తపల్లి మండలాల్లోని రావుల పల్లి, రూపిరెడ్డి పల్లి, తిరుమలగిరి, గోరి కొత్తపల్లి గ్రామాల్లో రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీరామ నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. రామాలయ నిర్వాహణ కమిటీ ఆధ్వర్యంలో అఖిలాండకోటి బ్రహ్మాండనాయుకుడైన శ్రీరాముడు, సీతమ్మల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది..మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల జయజయ ధ్వనాల మధ్య బుధవారం నవమి తిథి, పునర్వసు నక్షత్రం , మిధున లగ్నంలో జానకీ మాత శిరస్సున శ్రీరామచంద్రమూర్తి జీలకర్ర బెల్లం ఉంచారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు అమ్మవారి మెడలో స్వామివారు మాంగల్య ధారణ చేశారు.
రామయ్య పెళ్లిని తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తుల తరలివచ్చారు.భక్తులు సీతారాముల పాదాలపై తలంబ్రాలు వేసి ఆశీర్వాదాలు పొందారు. స్వామి వారి కల్యాణ మహోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా భూపాలపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు సాంబారి సాయికుమార్, బిజెపి జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్ రెడ్డి, పలువురు నేతలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, సీతారాముల వారి కళ్యాణాన్ని తిలకించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారు అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేశారు.అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో మహా అన్న దాన కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సురేష్ ఆచార్యులు, కార్తీక్ ఆచార్యులు, ఆలయ కమిటీ చైర్మన్ గన్ రెడ్డి లింగారెడ్డి, వైస్ చైర్మన్ పెండ్యాల రాజు, అన్నారపు బుచ్చిరెడ్డి, మేకల లింగయ్య అన్నారపు రమణారెడ్డి, మేకల రాజు, దుంపేటి నాగరాజు, వంగ రాజయ్య, పున్నం రఘు, తక్కలపల్లి క్రాంతి భక్తులందరూ పాల్గొన్నారు.
